కొలతలు సరిపోయేలా..విద్యార్థుల యూనిఫాం విషయంలో ముందు జాగ్రత్తలు

కొలతలు సరిపోయేలా..విద్యార్థుల యూనిఫాం విషయంలో ముందు జాగ్రత్తలు
  •     విద్యార్థుల యూనిఫాం విషయంలో ముందు జాగ్రత్తలు
  •     స్కూళ్లకు వెళ్లి  కొలతలు తీసుకుంటున్న నిర్వాహకులు

మెదక్, వెలుగు: ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా రెండు జతల యూనిఫాంలు ఉచితంగా అందజేస్తోంది. కొలతలు తీసుకోకుండా విద్యార్థులు చదివే తరగతి,  వారి వయస్సును అంచనా వేసి యూనిఫాంలు కుట్టిస్తున్నారు. ఇలా కొలతలు తీసుకోకుండా యూనిఫాంలు కుట్టించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విద్యార్థులు కొందరు పొడుగ్గా, కొందరు పొట్టిగా, మరి కొందరు లావుగా, ఇంకొందరు సన్నగా ఉండడం వల్ల యూనిఫాంలు చాలా మందికి సరిపోవడం లేదు. పొట్టిగా ఉండే ప్యాంట్లు, లొడాసు అంగీలు వేసుకునేందుకు విద్యార్థులు ఇష్ట పడడంలేదు. 

ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి యూనిఫాంలు అందజేస్తున్నా సైజుల తేడా వల్ల చాలా మంది విద్యార్థులు వాటిని వేసుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఈ నేపథ్యంలో విద్యా శాఖ యూనిఫాంల విషయంలో ఓ మంచి నిర్ణయం తీసుకొంది. 

విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే స్కూళ్లకు వెళ్లి విద్యార్థుల కొలతలు తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. సైజులు ఎక్కువ తక్కువ అనే సమస్య ఉండదిక. విద్యార్థులందరూ యూనిఫాం ధరించనున్నారు. మెదక్​ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 904 స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 73,721 మంది విద్యార్థులు చదువుతున్నారు. 

అందులో బాలురు 36,525 మంది, బాలికలు 37,196 మంది ఉన్నారు. రూరల్ ఏరియాలోని స్కూల్ విద్యార్థుల యూనిఫాంలు కుట్టే బాధ్యతను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కు, అర్బన్ ఏరియాలోని స్కూల్ విద్యార్థుల యూనిఫాంలు కుట్టే బాధ్యతను మెప్మాకు అప్పగించారు. జిల్లాలో రూరల్ ఏరియాలో 843 స్కూళ్లలో 64,383 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో బాలురు 32,192 మంది,  బాలికలు 32,191 మంది ఉన్నారు. అర్బన్ ఏరియాలో మొత్తం 61 స్కూల్ లు ఉండగా వాటిలో 9,338 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో బాలురు 4,333 మంది, బాలికలు 5,005 మంది ఉన్నారు. 

స్కూళ్లకు వెళ్లి..

ఆయా మండలాల్లో, పట్టణాల్లో ప్రభుత్వ స్కూల్​విద్యార్థుల యూనిఫాంలు కుట్టే బాధ్యతను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (ఎస్​హెచ్​జీ) మహిళలకు అప్పగించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన బట్టను వారికి అందజేస్తారు. ఇదివరకటిలా కాకుండా విద్యా సంవత్సరం ప్రారంభానికి నెలల ముందుగానే సంబంధిత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు తమకు కేటాయించిన స్కూళ్లకు వెళ్లి విద్యార్థుల కొలతలు తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల యూనిఫాం సైజ్ ఎక్కువ తక్కువ లేకుండా విద్యార్థులకు సరిగ్గా సరిపోతాయి.