రూ. 5 లక్షలు సుపారీ ఇచ్చి మామ ప్రాణాలు తీయించిన అల్లుడు.. సంగారెడ్డి జిల్లాలో ఘటన

రూ. 5 లక్షలు సుపారీ ఇచ్చి మామ ప్రాణాలు తీయించిన అల్లుడు.. సంగారెడ్డి జిల్లాలో ఘటన
  • భార్యను కాపురానికి పంపకుండా వేధిస్తున్నాడని  ఘటన

న్యాల్కల్/జహీరాబాద్, వెలుగు : భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి రూ. 5 లక్షలు సుపారీ ఇచ్చి తన మామను హత్య చేయించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. కేసుకు సంబంధించిన వివరాలను జహీరాబాద్ టౌన్ సీఐ రాజబోయిన రవి, ఎస్సై వినయ్ కుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. 

వికారాబాద్ జిల్లా బంటారం గ్రామానికి చెందిన బసవరాజ్ కు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మన్నాపూర్ గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. కొన్ని రోజులుగా యువతి కాపురానికి వెళ్లడం లేదు. దీంతో తన భార్య కాపురానికి రాకపోవడానికి ఆమె తండ్రి, ఆటో డ్రైవర్ అయిన శ్రీనివాస్ కారణమని బసవరాజ్ కక్ష పెంచుకున్నాడు. 

ఈ క్రమంలో అతడిని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు బంటారం గ్రామానికి చెందిన జడల రమేశ్, జడల సుభాష్, పరిగి మురళిని కలిసి తన మామను హత్య చేయాలని చెప్పాడు. ఇందుకు రూ. 5 లక్షలు సుపారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాడు. తర్వాత నిందితులు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం... ఆదివారం ప్యాసింజర్లుగా శ్రీనివాస్ ఆటో ఎక్కారు. తర్వాత అతడిని జహీరాబాద్ పట్టణ సమీపంలోని తూంకుంట గ్రామ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు. 

అనంతరం శ్రీనివాస్ డెడ్ బాడీపై, ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షలు, నాలుగు సెల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, బైక్​లను స్వాధీనం చేసుకున్నారు.