మధ్యాహ్న భోజనం తిన్న..విద్యార్థులకు అస్వస్థత

మధ్యాహ్న భోజనం తిన్న..విద్యార్థులకు అస్వస్థత

నిజామాబాద్ ​రూరల్, వెలుగు :  నిజామాబాద్​జిల్లా మోపాల్​మండలం బోర్గాం(పి) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.  స్కూల్​లో  240 విద్యార్థులు చదువుతుండగా గురువారం 141 మంది పాఠశాలకు వచ్చారు. మధ్యాహ్నం స్కూల్​లో పెట్టిన సాంబారు,  అన్నం తిన్నారు. గంట తరువాత ఒకరిద్దరు విద్యార్థులు కొడుపునొప్పిగా ఉందంటూ టీచర్లకు  చెప్పారు. కొద్దిసేపటికే వరసగా విద్యార్థులంతా వాంతులు చేసుకొంటూ కడుపునొప్పితో విలవిల్లాడారు.

అప్రమత్తమైన సిబ్బంది కడుపునొప్పితో బాధపడుతున్న 16 మందిని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరంతా నాలుగు, ఐదో తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన​అవసరం లేదని అధికారులు తెలిపారు. విద్యార్థుల అస్వస్థతకు మధ్యాహ్న భోజనమే కారణమా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని చెప్పారు.