
కాలేజీలో మౌలిక వసతులు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యలపై స్పందించని అధికారుల వైఖరికి నిరసనగా ప్లకార్డులు పట్టుకుని ధర్నా నిర్వహించారు. కాలేజీలో 400 మంది విద్యార్థినులు ఉంటే కేవలం ఒకే ఒక వాష్ రూమ్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 మంది బాయ్స్ విద్యార్థులకు వాష్ రూమ్స్ లేవని మండిపడ్డారు. కాలేజీకి వచ్చిన తర్వాత వాష్ రూమ్స్ కు వెళ్లకుండా టాబ్లెట్లు వేసుకుంటున్నారని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సరూర్ నగర్ జూనియర్ కాలేజీలో నెలకొన్న సమస్యలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ కమిషనర్ వచ్చి పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. గత నాలుగేండ్లుగా ఇదే సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు పదివేల రూపాయలతో వాటర్ ట్యాప్ లను రిపేరు చేస్తే పగలగొట్టారని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.కాలేజీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మద్దతు తెలిపారు. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని శ్రీవాణి కోరారు.