కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంటి ముట్టడికి యత్నం

కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంటి ముట్టడికి యత్నం
  •   నీట్ పేపర్ లీకేజీపై స్పందించాలని స్టూడెంట్‌‌‌‌ లీడర్ల డిమాండ్

కరీంనగర్, వెలుగు: నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంపై నోరు మెదపని బండి సంజయ్‌‌‌‌కి కేంద్ర మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని స్టూడెంట్‌‌‌‌ లీడర్లు ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. ఈ మేరకు ఆదివారం ఏఐఎస్‌‌‌‌ఎఫ్, ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌యూఐ, పీడీఎస్‌‌‌‌యూ, ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఐ ఆధ్వర్యంలోని విద్యార్థులు కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని బండి ‌‌‌‌సంజయ్ క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు యత్నించారు.‌‌‌‌‌‌‌‌ కోర్టు నుంచి ర్యాలీగా సంజయ్ క్యాంపు ఆఫీస్‌‌‌‌కు వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, స్టూడెంట్ లీడర్లకు మధ్య తోపులాట జరగడంతో, వారిని అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

 ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్‌‌‌‌కి మత రాజకీయాలపై ఉన్న శ్రద్ధ లక్షలాది మంది విద్యార్థుల అంశంపై లేకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కి ఉద్యమం చేస్తుంటే ఎందుకు ప్రధాని మోదీ మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై మోదీ ఛాయ్ పే చర్చా నిర్వహించేలా సంజయ్ కోరాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఏఐఎస్‌‌‌‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలసాని లెనిన్, ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌యూఐ జిల్లా అధ్యక్షుడు మునిగంటి అనిల్, పీడీఎస్‌‌‌‌యూ జిల్లా అధ్యక్షుడు రాణా ప్రతాప్, అంగడి కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు రామారావు వెంకటేశ్‌‌‌‌, మచ్చ రమేశ్‌‌‌‌, అరవింద్, గజ్జల శ్రీకాంత్, నరేశ్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.