ముందు నీతులు..వెనుక గోతులు!.. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలంటూ ఏపీ లేఖలు

ముందు నీతులు..వెనుక గోతులు!.. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలంటూ ఏపీ లేఖలు
  • తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలంటూ కేంద్రానికి డిసెంబర్​లోనే ఏపీ లేఖలు

జూరాల ఆధారంగా చేపడుతున్న ఫ్లడ్ ఫ్లో కెనాల్, కల్వకుర్తి ఫేజ్-2, కోయిల్ కొండ-గండీడ్ లిఫ్ట్, రేలంపాడు, గట్టు తదితర 16 ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఫిర్యాదు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినా అక్రమ ప్రాజెక్టులంటూ వితండవాదంఇవికాకుండా మరో 42 ప్రాజెక్టులూ చేపడుతున్నారని ఆరోపణవరద జలాలపై ప్రాజెక్టులే లేకున్నా.. అక్రమంగా ఏపీ ప్రాజెక్టుల నిర్మాణంమన ప్రాజెక్టులపై మాత్రం అడుగడుగునా చంద్రబాబు అక్కసు ఒక్క పాలమూరు-రంగారెడ్డిని అడ్డుకునేందుకే 2015 నుంచి 2017 వరకు 5 లేఖలు.

హైదరాబాద్, వెలుగు:నదీ జలాల విషయంలో ఏపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నది. ఓవైపు అక్రమంగా వరద జలాలను తరలించుకుపోతూనే.. మరోవైపు అష్యూర్డ్ వాటర్స్ మీద తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నది. నీళ్ల విషయంలో తాను తెలంగాణకు ఏనాడూ అన్యాయం చేయలేదని, అక్కడి ప్రాజెక్టులను అడ్డుకోలేదని, కలిసి ముందుకు పోదామని ఓపక్క చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు.. మరోపక్క కృష్ణా బేసిన్​లో స్టోరేజీ పెంచుకునేందుకు తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. 

ఎప్పుడో ప్రారంభించిన కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్, కోయిల్ సాగర్, జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ సహా16 ప్రాజెక్టులను ఆపాలంటూ కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)కు నిరుడు డిసెంబర్ 5న ఏపీ లేఖలు రాయగా.. అవి తాజాగా బయటపడ్డాయి. అంతేకాదు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్, డిండి, భీమా, భక్తరామదాసు సహా మరో 42 ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ 2021 నుంచి 2024 వరకు రాసిన లేఖలనూ వీటికి జత చేయడం గమనార్హం. గతంలోనూ పాలమూరు–రంగారెడ్డిని అడ్డుకోవడానికి 2015 నుంచి 2017 వరకు చంద్రబాబు 5 లేఖలు రాసి రాష్ట్ర ప్రయోజనాలకు గండికొట్టేందుకు యత్నించారు.    

ఆ జీవోపై అభ్యంతరాలు..

ఉమ్మడి నల్గొండ, మహబూబ్​నగర్, రంగారెడ్డి, వరం గల్, ఖమ్మం జిల్లాల్లో సాగుతో పాటు హైదరాబాద్​కు తాగునీటికి16 ప్రాజెక్టులను చేపట్టేలా నిరుడు సెప్టెంబర్ 16న రాష్ట్ర ప్రభుత్వం జీవో 34ను జారీ చేసింది. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్​ల తయారీకి అధికారులకు ఆదేశాలిచ్చింది. అయితే, అవన్నీ అక్రమ ప్రాజెక్టులంటూ కేంద్రానికి రాసిన లేఖల్లో ఏపీ పేర్కొంది. ఎవరి అనుమతులూ లేకుండానే ఏపీలో కొత్త ప్రాజెక్టులను చేపడుతున్న పొరుగు రాష్ట్రం..  ఉమ్మడిరాష్ట్రంలోనే ప్రతిపాదించినవి, అప్పటికే ప్రారంభమైన మన ప్రాజెక్టులను సైతం అక్రమ ప్రాజెక్టులంటూ అభ్యంతరాలు చెబుతోంది. 

ఉమ్మడి ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులైనా.. సీడబ్ల్యూసీ అనుమతులు రాకుంటే, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇవ్వకుంటే వాటిని కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాలంటూ వాదిస్తున్నది. రాష్ట్ర విభజన జరిగాక పాలమూరు–రంగారెడ్డి, డిండి సహా 42 కొత్త ప్రాజెక్టులను చేపట్టిందని, దీనిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఏపీ కొర్రీలు పెట్టింది. తాజాగా నిరుడు16 కొత్త ప్రాజెక్టులకు జీవో జారీ చేసిందంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. మనం హక్కుగా కట్టుకునే ప్రాజెక్టులతో.. ఏపీ అక్రమంగా కట్టుకుంటున్న ప్రాజెక్టులకు నష్టం కలుగుతుందని వాదించడం గమనార్హం. 

తాను పెంచుకుంటూ.. మనకు గండికొడుతూ

తెలంగాణకు నీళ్ల విషయంలో ఉమ్మడి పాలకులు అన్యాయమే చేశారు. కృష్ణా బేసిన్​లో కనీసం స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మించలేదు. అదేసమయంలో రాయలసీమలో 350 టీఎంసీలకుపైగా స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మించుకున్నారు. శ్రీశైలానికి గండికొట్టేలా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుకున్నారు. ముచ్చుమర్రి, వెలిగొండ, హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులనూ చేపట్టారు. పోతిరెడ్డిపాడు నుంచి టీఎంసీల కొద్దీ జలాలను తన్నుకుపోయేందుకు ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులు చేపట్టారు. ఇవన్నీ చాలవన్నట్టు రాష్ట్ర విభజన జరిగాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏపీ ముంగటేసుకున్నది.  తాజాగా గోదావరి నీళ్లకు ఎసరు పెట్టింది. పోలవరం–నల్లమలసాగర్ పేరిట వరద జలాలను తన్నుకుపోయి మన వాటాకు ఎగనామం పెట్టే కుట్రలకు తెరలేపింది. వరదజలాల ఆధారంగా ప్రాజెక్టులు లేకపోయినప్పటికీ.. సముద్రంలో కలిసే నీళ్లనే వాడుకుంటామంటూ మోసపూరిత కబుర్లు చెబుతున్నది. అవన్నీ సక్రమమైన ప్రాజెక్టులన్నట్టుగా ఏపీ చెప్పుకుంటున్నది. 

మనవి అన్నీ అక్రమ ప్రాజెక్టులట.. 

కృష్ణాలో దశాబ్దాలుగా అన్యాయం జరుగుతున్న తెలం గాణకు.. న్యాయం చేసేలా అష్యూర్డ్ వాటర్స్ మీద 350 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే 16 ప్రాజెక్టులకు డీపీఆర్​లు తయారు చేయాలంటూ నిరుడు సెప్టెంబర్16న ఉత్తర్వులు జారీ చేసింది. అందులో జూరాల ఆధారంగా ఎప్పుడో చేపట్టిన ప్రాజెక్టులే ఉన్నాయి. కానీ, వాటినే ఏపీ అక్రమ ప్రాజెక్టులంటూ అడ్డుకుంటున్నది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు సీఎంగా ఉన్న 2014 నుంచి 2019 మధ్య కాలంలో అనేకసార్లు వివిధ ప్రాజెక్టు లపై అభ్యంతరాలు చెబుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

 పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఆపా లంటూ 2016 ఏప్రిల్ 24న స్వయంగా చంద్రబాబే లేఖ రాశారు. డిండిని కూడా ఆపాలంటూ 2015 జూన్​ 11, 2015 ఆగస్టు 1, 2016 ఫిబ్రవరి 8న ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కట్టింది తానేనంటూ చెప్పుకుంటున్న చంద్రబాబే.. ఆ ప్రాజెక్టే అక్రమంటూ 2015 నవంబర్ 7న కేంద్రానికి లేఖ రాశారు. 2017 జనవరి 31, 2017 ఫిబ్రవరి 8న ఎస్సారెస్పీ స్టేజ్1, సీతారామ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ రెండు సార్లు ఏపీ  కేంద్రానికి లేఖ రాసింది. 

అదే ఏడాది 2017 మార్చి 19న భక్తరామదాసు లిఫ్ట్​ను ఆపాలని, 2017 ఏప్రిల్ 7న తుమ్మిళ్ల లిఫ్ట్​ను ఆపాలని లేఖ రాసింది. మరోసారి పాలమూరు–రంగారెడ్డి, భక్తరామదాసు లిఫ్ట్ స్కీమ్​ను ఆపాలంటూ 2017 జులై 1న లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ 2018 జూన్ 13న చంద్రబాబు ప్రభుత్వమే కేంద్రానికి ఫిర్యాదు చేసింది. 

ఇందులో కరువు ప్రాంతాలకు నీళ్లందించే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఆపాలంటూ ఒకటి కాదు.. రెండు కాదు ఐదు సార్లు చంద్రబాబు ప్రభుత్వం లేఖలు రాసింది. తెలంగాణకు మేలు చేస్తామని చెబుతూనే.. ఇన్ని అడ్డుపుల్లలు వేసి పాలమూరు ప్రాజెక్టుకు అడ్డుపడ్డది చంద్రబాబు ప్రభుత్వమేనన్న వాదనలకు ఈ లేఖలే బలం చేకూరుస్తున్నాయి. చంద్రబాబు అడ్డుకోవాలని చూసిన ప్రాజెక్టులన్నీ మనం అష్యూర్డ్ వాటర్స్ (నికర జలాల) మీద కట్టుకుంటున్నవేనని నిపుణులు చెప్తున్నారు. 

జీవో 34 ద్వారా తెలంగాణ చేపట్టిన 16 ప్రాజెక్టులు ఇవే.. 

  • రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెపాసిటీ 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంపు.
  • గట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెపాసిటీ 1.32     టీఎంసీల నుంచి 5 లేదా10 టీఎంసీలకు పెంపు.
  • 25 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు 4 టీఎంసీల నీళ్లు ఇచ్చేందుకు జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫేజ్ 2. 
  • పులిచింతల ఫోర్​షోర్ నుంచి వేములూరు వాగుపై 0.5 టీఎంసీల సామర్థ్యంతో బొజ్జా తండా–భీమా తండా లిఫ్ట్ స్కీమ్. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని 3 గ్రామాల్లో ఉన్న 1,380 ఎకరాలకు సాగు నీరందించే ప్లాన్.
  • మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్​ స్కీమ్ సెకండ్ ఫేజ్. 93,531 ఎకరాల అదనపు ఆయకట్టును సృష్టించేలా శ్రీశైలం నుంచి 13 టీఎంసీలను లిఫ్ట్ చేసేందుకు చేపట్టే ఫేజ్ 2లో కెనాల్స్, హెడ్​వర్క్స్ పనులు. తాగునీటి కోసం 7.12 టీఎంసీల సరఫరాకు ప్లాన్.  
  • 100 రోజుల్లో రోజూ 2 టీఎంసీల చొప్పున 100 టీఎంసీలు తరలించేలా జూరాల ఫ్లడ్​ఫ్లో కెనాల్. నల్గొండ, వరంగల్, మహబూబ్​నగర్, ఖమ్మం జిల్లాల్లో 11.3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.  
  • మహబూబ్​నగర్ జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగు, తాగునీటి కోసం123 టీఎంసీల తరలింపునకు కోయిల్​కొండ–గండీడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. జూరాల ఆధారంగా చేపట్టే ఈ ప్రాజెక్టులో భాగంగా కోయిల్​కొండ రిజర్వాయర్ 45 టీఎంసీలు, గండీడ్ రిజర్వాయర్​35 టీఎంసీలు, దౌల్తాబాద్ రిజర్వాయర్ 43 టీఎంసీలను నిర్మించనున్నారు. 
  • 3.30 టీఎంసీల నీటిని వాడుకునేలా కోయిల్​సాగర్ లిఫ్ట్ స్కీమ్ సామర్థ్యం పెంపు. అదనంగా13,500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు. 
  • మహబూబాబాద్ జిల్లా గిరిజన ప్రాంతాల్లో 11,250 ఎకరాలకు నీళ్లిచ్చేలా జయపురం వద్ద ఆకేరు నదిపై 2 టీంఎసీలతో ఆకేరు బ్యారేజ్​
  • మహబూబాబాద్ జిల్లా విస్సంపల్లిలో ఆకేరు నదిపై 1.2 టీఎంసీల వినియోగానికి బ్యారేజీ నిర్మాణం. 11,799 ఎకరాలకు నీళ్లు. 
  • మహబూబాబాద్ జిల్లా ఏదులపూసపల్లి వద్ద మున్నేరు నదిపై బ్యారేజీ. 13,201 ఎకరాలకు నీళ్లిచ్చేలా 1.3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం. 
  • మహబూబాబాద్ జిల్లా ముల్కనూరు వద్ద మున్నేరు నదిపై మున్నేరు బ్యారేజీ. 11,871 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు 1.2 టీఎంసీలతో బ్యారేజ్
  • మహబూబాబాద్ జిల్లా ముల్కపల్లి వద్ద 25 నుంచి 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్. ​
  • ఖమ్మం జిల్లా ఏదులచెరువు వద్ద ఆకేరు నదిపై బ్యారేజ్. 13,129 ఎకరాలకు నీళ్లిచ్చేలా1.3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం. 
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3.99 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా 35 టీఎంసీల వినియోగానికి ఎస్ఎల్​బీసీ కెనాల్ ఎక్స్​టెన్షన్. రోజూ ఒక టీఎంసీ చొప్పున తరలించేలా నిర్మాణం.  
  • హైదరాబాద్ సిటీతో పాటు రీజినల్ రింగ్ రోడ్ ప్రాంతంలో తాగు నీటి అవసరాల కోసం 30 టీఎంసీల సామర్థ్యంతో మూడు రిజర్వాయర్లు. దేవులమ్మ నాగారం, దండు మైలారం, ఆరుట్లల్లో 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం.