మాయమవుతున్న మూగజీవాలు..! వరంగల్ కమిషనరేట్ లో ఏటా 300కు పైగా పశువులు మిస్సింగ్

మాయమవుతున్న మూగజీవాలు..! వరంగల్ కమిషనరేట్ లో ఏటా 300కు పైగా పశువులు మిస్సింగ్
  • బావులు, పొలాల వద్ద కట్టేసిన జీవాలను ఎత్తుకెళ్తున్న దుండగులు
  • జహీరాబాద్​లోని పశువధశాలకు
  • తరలిస్తున్నారనే ఆరోపణలు
  • అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు

హనుమకొండ, భీమదేవరపల్లి, వెలుగు : వరంగల్ కమిషనరేట్ పరిధిలో మూగజీవాలు మాయమవుతున్నాయి. పొలాలు, బావుల వద్ద కట్టేసిన ఎడ్లు, ఆవులు, బర్లు, మేకలు, గొర్లను దుండగులు గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్తున్నారు. ముందుగా డే టైంలో రెక్కీ నిర్వహించి.. రాత్రివేళ్లలో లారీలు, డీసీఎంలు, ఇతర కంటైనర్లలో జిల్లాలు దాటిస్తున్నారు. దీంతో పాడి పశువులపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలా ఎత్తుకెళ్తున్న మూగజీవాలను జహీరాబాద్ పశు వధశాలలకు తరలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

ఏటా 300కుపైగా..

వరంగల్ కమిషనరేట్ పరిధిలో జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని రూరల్ ఏరియాలను టార్గెట్ చేసి దుండగులు పశువులను ఎత్తుకెళ్తున్నారు. వ్యవసాయ బావులు, పశువుల కొట్టాలు, ఇండ్ల వద్ద కట్టేసి ఉంటున్న మూగజీవాల గురించి ముందుగానే ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఉండే కొందరితో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని, వారి సహాయంతో ఎడ్లు, బర్లు, ఆవులు, మేకలు, గొర్రెలను ఎత్తుకెళ్లేందుకు రెక్కీ నిర్వహిస్తారు. అనంతరం నెంబర్ ప్లేట్ లేని బొలెరోలు, డీసీఎంలు, ఇతర వాహనాల్లో రాత్రివేళలో పశువులను అక్రమంగా జిల్లాలు దాటిస్తున్నారు. ఇలా వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఏటా 300కుపైగా పశువులు మిస్ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 

ఓరుగల్లు టు జహీరాబాద్ !

ప్రస్తుత సంగారెడ్డి జిల్లా పరిధిలోని జహీరాబాద్ నుంచి మాంసం ఎగుమతి ఎక్కువగా జరుగుతోంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో గోదాములు, వధశాలలు ఉన్నాయి. వరంగల్ కమిషనరేట్ లోని వివిధ ప్రాంతాల నుంచి దొంగిలించిన పశువులను అక్కడికి తరలిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ముగ్గురు రైతులకు సంబంధించిన 14 గొర్రెలు,10  బర్లను దుండగులు ఎత్తుకెళ్లారు.

ముత్తారం గ్రామంలో ఇద్దరు రైతులకు చెందిన రెండు గేదెలు, కొత్తకొండలో మరో ఇద్దరికి చెందిన ఆరు ఎడ్లను కూడా దొంగిలించుకుపోయారు. కాగా వీటన్నింటినీ జహీరాబాద్ వధశాలలకే తరలించారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు మాంసాన్ని ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుండటం గమనార్హం. 

అర్ధరాత్రి గప్ చుప్ గా..

గోవధ నిషేధ చట్టం ప్రకారం పశువుల అక్రమ రవాణ నేరం. అయినా అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలున్నాయి. కాగా పశువులను దుండగులు అర్ధరాత్రి సైలెంట్ గా జిల్లాలు దాటిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి  మూగజీవాలను తరలించాల్సి వస్తే వెటర్నరీ, ట్రాన్స్ పోర్టుకు సంబంధించిన సర్టిఫికెట్లు అవసరం. కానీ ఇక్కడ వాటితో పని లేకుండా మూగజీవాలను గోవధకు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రాత్రివేళల్లో అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో పశువుల అక్రమ రవాణా సాగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా పోలీస్ ఉన్నతాధికారులు పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. 

ఫెన్సింగ్ కట్ చేసి ఎత్తుకెళ్లారు

మా పొలం వద్ద బర్లు, గొర్ల కోసం షెడ్ వేశాను. మూడు నెలల వ్యవధిలో తొమ్మిది గొర్రెలు, మూడు బర్రెలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. షెడ్ కు వేసిన ఫెన్సింగ్ ను కట్ చేసి వాటిని తరలించుకుపోయారు. దీంతో రూ.5 లక్షల వరకు లాస్ అయ్యాను. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు. కంచర్ల రాజేందర్, బాధిత రైతు, కొత్తపల్లి