ఐప్యాక్ ఆఫీస్లో ఈడీ సోదాలు..అడ్డుకున్న మమత

ఐప్యాక్ ఆఫీస్లో ఈడీ సోదాలు..అడ్డుకున్న మమత
  • సోదాల సమయంలో ఐప్యాక్ చీఫ్ జైన్ ఇంటికి వెళ్లిన సీఎం 
  • తమ పార్టీ అభ్యర్థుల జాబితా, వ్యూహాలను దొంగిలించడానికి వచ్చారని ఫైర్​

కోల్‌‌‌‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌‌‌‌కతాలో గురువారం హైడ్రామా చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త, ఐ-ప్యాక్ రాజకీయ కన్సల్టెన్సీ గ్రూప్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇల్లు, ఆఫీసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ కేసు విషయంలో దాడులు నిర్వహిస్తున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. అయితే, వారు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ప్రతీక్​ జైన్ ​ఇంటికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కోల్‌‌‌‌కతా పోలీస్ చీఫ్ వినీత్ గోయల్ వెళ్లారు. అనంతరం సీఎం మమతా ఓ గ్రీన్​కలర్​ ఫైల్​ తీసుకొని తీవ్ర ఆగ్రహంతో బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈడీ చర్య రాజకీయ ప్రేరేపితమైనదని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే సోదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తృణమూల్  కాంగ్రెస్​పార్టీ ఎన్నికల వ్యూహం, 2026 ఎన్నికల అభ్యర్థుల జాబితాలు, పార్టీ రహస్య పత్రాలను దొంగిలించడానికి ఈడీ ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ ఘటన బెంగాల్​ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఐ-ప్యాక్.. చాలా ఏండ్లుగా టీఎంసీతో కలిసి పనిచేస్తోంది. 2021, 2019 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించింది. ప్రశాంత్ కిశోర్ బిహార్ ఎన్నికలలో పోటీ చేయడానికి వైదొలిగిన తర్వాత ప్రతీక్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. జైన్.. మమత ప్రభుత్వంలో ఐటీ సెల్ చీఫ్​గా కూడా పనిచేస్తున్నారు.

బొగ్గు కుంభకోణం కేసులోనే సోదాలు: ఈడీ 

కోట్లాది రూపాయల బొగ్గు అక్రమ రవాణా కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగానే గురువారం కోల్‌‌‌‌కతాలోని ఐ-ప్యాక్ ఆఫీసు, ఆ సంస్థ చీఫ్​ ప్రతీక్ జైన్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. సాల్ట్ లేక్‌‌‌‌లోని ఐ-ప్యాక్ ఆఫీస్, లౌడన్ స్ట్రీట్‌‌‌‌లోని జైన్ ఇల్లు సహా, ఢిల్లీలోని నాలుగు ప్రాంతాలు.. మొత్తం 10 ఏరియాల్లో కేంద్ర పారామిలిటరీ బృందాల భద్రతలో ఉదయం 7 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నట్ట వెల్లడించాయి. బొగ్గు కుంభకోణం కేసులో కొన్ని నిర్దిష్ట ఆధారాలు ఉన్నందునే ప్రతీక్​జైన్​పై దర్యాప్తు జరుగుతోందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ దాడులు ఏ రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని జరగలేదని ఈడీ తెలిపింది. తమ దాడులకు సీఎం మమత ఆటంకం కలిగించారని.. డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపిస్తూ కలకత్తా హైకోర్టును ఈడీ ఆశ్రయించింది.