ఇండియాపై ట్రంప్ టారిఫ్ బాంబ్..500 శాతం సుంకాల బిల్లుకు ఆమోదం

ఇండియాపై ట్రంప్ టారిఫ్ బాంబ్..500 శాతం సుంకాల బిల్లుకు ఆమోదం
  • 500 శాతం సుంకాల బిల్లుకు ఆమోదం వచ్చే వారం సెనేట్​లో ఓటింగ్​కు చాన్స్!
  • ‘సాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్- 2025’ బిల్లు రూపకల్పన
  • రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగానే సుంకాలు
  • చైనా, బ్రెజిల్​పైనా భారీ టారిఫ్​లకు ట్రంప్ నిర్ణయం
  • ఉక్రెయిన్, రష్యా వార్ ఆపేందుకే అంటున్న వైట్​హౌస్
  • బిల్లుకు ‘‘ఎకనామిక్ బంకర్ బస్టర్’’గా పేరు
  • బట్టలు, ఫార్మా ఎగుమతులపై ప్రభావం

వాషింగ్టన్: రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై, ముఖ్యంగా ఇండియా, చైనా, బ్రెజిల్‌‌‌‌పై 500 శాతం వరకు టారిఫ్‌‌‌‌లు విధించే బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు. రష్యా, ఉక్రెయిన్‌‌‌‌ మధ్య యుద్ధం ముగించేందుకు ట్రంప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వైట్​హౌస్ వర్గాలు వెల్లడించాయి. యూఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం, డెమొక్రాట్ రిచర్డ్ బ్లూమెంటల్ కలిసి రూపొందించిన ‘శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్- 2025’ బిల్లును ట్రంప్ ఆమోదించారు. ఈ బిల్లు వచ్చే వారమే అమెరికా సెనేట్‌‌‌‌లో ఓటింగ్‌‌‌‌కు వచ్చే అవకాశం ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఆర్థిక ఒత్తిడిపెంచడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. 

ట్రంప్ కు అసాధారణ అధికారాలు

ఈ బిల్లు ప్రకారం.. రష్యా నుంచి క్రూడాయిల్, గ్యాస్ లేదా యురేనియం వంటి ఇంధనాలను కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై కనీసం 500 శాతం టారిఫ్ విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. ఇండియా ప్రస్తుతం రష్యా నుంచి భారీగా ముడి చమురును తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నది. దీంతో ఉక్రెయిన్​తో రష్యా యుద్ధం చేసేందుకు నిధులు సమకూరుతున్నాయని అమెరికా భావిస్తున్నది. అయితే, బిల్లు అమల్లోకి వస్తే ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయని ఎక్స్​పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

రష్యాను పరోక్షంగా నాశనం చేసేందుకే: గ్రాహం 

రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌‌‌‌లో పుతిన్ రక్తపాతానికి సహకరిస్తున్న దేశాలను శిక్షించేందుకు ఇది మంచి ఆయుధం అని గ్రాహం పేర్కొన్నారు. ఈ బిల్లును ఆయన ‘‘ఎకనామిక్ బంకర్ బస్టర్’’ అని అభివర్ణించారు. రష్యా చమురు కొనుగోలు చేసే ఇండియా, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించారు. ‘‘ఇండియా,  మిత్రదేశమే అయినప్పటికీ, రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే మినహాయింపులు ఉండవు. భారీ టారిఫ్‌‌‌‌ల ద్వారా ఇండియాను రష్యాకు దూరం చేసి, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఒంటరిని చేయడమే మా వ్యూహం’’ అని గ్రాహం స్పష్టం చేశారు.

టెక్స్ టైల్స్, ఫార్మా ఉత్పత్తులపై ప్రభావం

ఈ బిల్లు చట్టంగా మారి అమలులోకి వస్తే..  బట్టలు, ఫార్మా (మందులు), ఐటీ సేవలు, ఇంజనీరింగ్ వస్తువుల ధరలు 5 రెట్లు పెరుగుతాయి. దీంతో మన ఎగుమతులు దెబ్బతింటాయి. ఇది రూపాయి విలువ పడిపోవడానికి, భారతీయ ఎగుమతిదారుల నష్టాలకు కారణమవుతుంది. ఇప్పటికే 2025, ఆగస్టులో ఇండియాపై ట్రంప్ 25% అదనపు సుంకం విధించారు. దీంతో ప్రస్తుతం కొన్ని వస్తువులపై మొత్తం సుంకం 50% కు చేరింది.  

ఐఎస్ఏ సహా 66 సంస్థలకు గుడ్ బై

ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయనే కారణంతో 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా వైదొలగాలని  ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఇండియా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్​ఏ) కూడా ఉంది. దీన్ని 2015లో ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అప్పటి అధ్యక్షుడు హోలాండే కలిసి ప్రారంభించారు. దీని మెయిన్ ఆఫీస్ హర్యానాలోని గురుగ్రామ్​లో ఉంది. ఇక 66 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్​లో 31 యునైటెడ్ నేషన్స్ అనుబంధ సంస్థలు, 35 ఇతర అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. యునెస్కో, డబ్ల్యూహెచ్​వో, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ వంటి కీలక విభాగాల నుంచి కూడా అమెరికా వైదొలుగుతున్నట్లు లేదా నిధులు నిలిపివేస్తున్నట్లు సమాచారం.