ట్రాన్స్ పోర్ట్ హబ్ గా పెద్దపల్లి..ఐదు ఆర్‌‌‌‌వోబీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ట్రాన్స్ పోర్ట్  హబ్ గా పెద్దపల్లి..ఐదు ఆర్‌‌‌‌వోబీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
  •     ఇప్పటికే రెడీ అయిన కోల్ కారిడార్ డీపీఆర్
  •     పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాణం పోస్తున్న ఎంపీ వంశీకృష్ణ
  •     విజనరీ లీడర్‌‌‌‌గా ముందుకు..

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ట్రాన్స్​పోర్ట్ హబ్​గా మారునున్నది. జిల్లాలోని మెయిన్ రోడ్లపై ఉన్న రైల్వే గేట్ల వద్ద 5 ఆర్వోబీల మంజూరుకు కేంద్రం సుముఖత ప్రకటించింది. ఇప్పటికే రామగుండం నుంచి మణుగూరు వరకు నిర్మించే కోల్ కారిడార్​కు సంబంధించి రూ.4 వేల కోట్లతో డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధమైంది. ఇవి దశాబ్దాలుగా పెండింగ్​లో ఉండగా.. ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలిచిన మొదటి రోజు నుంచే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఒక విజన్​తో ఆయన ముందుకు సాగుతున్నారు. రవాణా సదుపాయాలపై ప్రతి పార్లమెంట్ సెషన్​లో ప్రశ్నించారు. 

జిల్లాలో పెండింగ్​లో ఉన్న 5 ఆర్వోబీలు, కోల్ కారిడార్ నిర్మాణాన్ని కేంద్రంతో పోరాడి ఒప్పించారు. పెద్దంపేట, కుందనపల్లి, గౌరెడ్డిపేట, చీకురాయి, ఓదెల రైల్వే గేట్ల వద్ద ఆర్వోబీలు శాంక్షన్ అయ్యాయి. ఇటీవల ఎంపీ వంశీకృష్ణ రైల్వే అధికారులతో కలిసి ఓదెల ఆర్వోబీ అలైన్​మెంట్​ను, స్థలాన్ని పరిశీలించారు.

రైల్వే, రోడ్డు మార్గాలు విస్తృతం

పెద్దపల్లి జిల్లా కేంద్రంగా రైల్వే, రోడ్డు మార్గాలు విస్తృతం అవుతున్నాయి. 5 ఆర్వోబీలు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి రాఘవాపూర్ రైల్వే స్టేషన్ మీదుగా 4 జిల్లాలను కలుపుతూ 208 కిలో మీటర్ల కోల్ కారిడార్ రైల్వే లైన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే  గ్రీన్​ ఫీల్డ్ హైవే పనులు స్టార్ట్ అయ్యాయి. వరంగల్, మంచిర్యాల 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల మధ్య రవాణా ఈజీ అవుతుంది. పెద్దపల్లి జిల్లా కావడంతో పాటు పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్​గా మారింది. 

ఈ క్రమంలో రైళ్ల రాకపోకలతో పాటు ఎక్స్​ప్రెస్​ రైళ్లు కూడా పెద్దపల్లిలో ఆగుతున్నాయి. హైదరాబాద్ నుంచి కాజీపేట మీదుగా పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్ మీదుగా పెద్దపల్లి ట్రైన్ల రాకపోకలు జరుగుతున్నాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల టైంలో ఎంపీ వంశీకృష్ణ రైల్వే కోల్ కారిడార్ నిర్మాణానికి కృషి చేస్తానని, జిల్లాలో రవాణా సౌకర్యాలు పెంపొందేలా చూస్తానని మాటిచ్చారు. చెప్పినట్లుగానే కేంద్రాన్ని ఒప్పించారు.

సింగరేణి కోల్ బెల్ట్​ను కలుపుతూ..

పెద్దపల్లి జిల్లా రామగుండం, మణుగూరు రైల్వేలైన్ 208 కిలో మీటర్ల పరిధిలో సింగరేణి కోల్​బెల్ట్​ను కలుపుతుంది.పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉన్న కోల్​బెల్ట్​ను కలుపుతూ ఈ రైల్వే లైన్​ నిర్మాణం కానున్నది. ఇప్పటికే 4 జిల్లాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లను కూడా గుర్తించారు. రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకోవడం ఈజీ అవుతది. 

ప్రస్తుతం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ప్రయాణికులు భద్రాద్రి కొత్తగూడెం పోవాలంటే కాజీపేట మీదుగా తిరిగిపోవాల్సి వస్తున్నది. కొత్త రైల్వే లైన్ పూర్తయితే పెద్దపల్లి నుంచి ములుగు, భూపాలపల్లి నుంచి కొత్తగూడెం పోవచ్చు. ఈ క్రమంలో వందల కిలో మీటర్ల దూరం తగ్గిపోతుంది.

రవాణా సౌకర్యాల  అభివృద్ధికి ప్రాధాన్యం

రవాణా సౌకర్యాలను మెరుగుపరిస్తే ఏ ప్రాంతమైనా ఈజీగా అభివృద్ధి సాధిస్తుంది. ఈ ఆలోచనతోనే ఎన్నికల టైంలో రైల్వే లైన్స్​తో పాటు ఆర్వోబీల నిర్మాణాలకు కృషి చేస్తానని మాటిచ్చాను. అలాగే వాటిని సాధించడంలో సఫలమయ్యాను. 

సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయగలిగేది రైళ్లలో. అందుకే ప్రతీ రైల్వే స్టేషన్​లో ప్యాసింజర్​ రైళ్లతో పాటు చాలా ఎక్స్​ప్రెస్​ రైళ్లే నిలిపేలా కేంద్ర రైల్వే శాఖను ఒప్పించాను. రానున్న రోజుల్లో ప్రజల అత్యవసరాలను గుర్తించి వాటిని సాధించేలా కృషి చేస్తాను.
– పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ