- సీఎం కప్-2025 సెకండ్ ఎడిషన్పోటీలు ప్రారంభం
పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్ జిల్లాను క్రీడల్లో ముందు వరుసలో నిలపాలని కలెక్టర్ హరిచందన దాసరి క్రీడాకారులకు సూచించారు. గురువారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో సీఎం కప్–2025 సెకండ్ఎడిషన్పోటీలను అడిషనల్ కలెక్టర్ జితేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జిల్లా క్రీడాకారులు అన్ని క్రీడల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని ఆకాంక్షించారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయని చెప్పారు. మైనారిటీ సంక్షేమ పాఠశాలల్లోనూ ప్రధాన క్రీడా టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీవో సాయిరాం, డీవైఎస్వో సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ వినీల, టీచర్లు, పీఈటీలు, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఎల్బీ నగర్లో టార్చ్ రిలే ర్యాలీ..
ఎల్బీనగర్, వెలుగు: సీఎం కప్–2025 సెకండ్ఎడిషన్లో భాగంగా గురువారం టార్చ్ రిలే ర్యాలీ నిర్వహించారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో డీఈవో సుశీందర్రావు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎల్‌బీ నగర్ చౌరస్తా వరకు, అక్కడి నుంచి హయత్‌నగర్ జడ్పీ హైస్కూల్పాఠశాలకు చేరుకుంది. అక్కడ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, ఎంఈవో, హెడ్‌మాస్టర్, టీచర్లు, విద్యార్థులు స్వాగతం పలికారు.
తుక్కుగూడ వరకు చేపట్టిన ర్యాలీలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట్, మహేశ్వరం, తుక్కుగూడ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడాశాఖ అధికారి వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ ఈవెంట్స్ లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని సూచించారు. ఎల్బీనగర్ సీఐ వినోద్, కోచ్‌లు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
