మున్సిపోల్స్ హీట్!.. సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్

మున్సిపోల్స్ హీట్!.. సీఎం రేవంత్  రెడ్డి స్పెషల్ ఫోకస్
  • జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్‌‌ ఏర్పాట్లు
  • బీఆర్ఎస్​ నేతల బస్తీబాట.. అర్బన్‌‌లో పట్టుకు బీజేపీ యత్నం
  • ఇప్పటికే ఇన్‌‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం
  • జోరుగా శంకుస్థాపనలు, అభివృద్ధి పనులకు ప్లాన్​
  • కేడర్‌‌‌‌ను కాపాడుకునే పనిలో కేటీఆర్‌‌‌‌.. వరుసగా జిల్లాల టూర్లు
  • ఖమ్మం పర్యటనకు కొద్ది గంటలముందే కాంగ్రెస్‌‌లోకి గులాబీ కార్పొరేటర్లు
  • మున్సిపాలిటీల్లో తమను ఆదరిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామంటున్న బండి సంజయ్​
  • హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో ముందస్తు ప్రచారం

హైదరాబాద్​, వెలుగు:  వచ్చే నెలలో మున్సిపల్​ఎన్నికలకు సర్కారు రెడీ కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. పార్టీ సింబల్స్‌‌పై జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలన్నీ చాలెంజ్‌‌గా తీసుకుంటున్నాయి.  ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్, బీజేపీ నుంచి నేతలు బస్తీబాట పట్టారు. పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం సర్పంచ్​స్థానాలను గెలిచిన కాంగ్రెస్..​ అదే ఊపుతో మున్సిపాలిటీలపైనా మూడు రంగుల జెండా ఎగరేయాలని ఉత్సాహంతో ఉన్నది.

 సీఎం రేవంత్​, పీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్‌‌కుమార్​ గౌడ్​ ఇప్పటికే మున్సిపల్​ఎన్నికలపై రివ్యూ చేసి.. మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇన్‌‌చార్జి మంత్రుల సమక్షంలో జిల్లాలవారీగా ఆశావహుల జాబితాలను రెడీ చేస్తున్నారు. బస్తీల్లో అవసరమైన పనులను గుర్తించిన ఎమ్మెల్యేలు, మంత్రులు జోరుగా 
శంకుస్థాపనలు చేస్తున్నారు. దీంతోపాటు చేరికలపై అధికార పార్టీ ప్రధానంగా ఫోకస్​ పెట్టింది. 

బీఆర్‌‌ఎస్​, బీజేపీ నుంచి వచ్చే మాజీ, ప్రస్తుత కౌన్సిలర్లు,  కార్పొరేటర్లను  పార్టీలోకి చేర్చుకుంటున్నది. తాజాగా.. ఖమ్మం నుంచి వచ్చిన తొమ్మిది మంది బీఆర్ఎస్​ కౌన్సిలర్లు సీఎం రేవంత్​ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. దీంతో కేడర్‌‌‌‌ను కాపాడుకునేందుకు బీఆర్‌‌‌‌ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ స్వయంగా రంగంలోకి దిగారు.  బుధవారం ఆయన ఖమ్మంలో పర్యటించి కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 

కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఆదేశాల మేరకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బస్తీ బాట పట్టారు. మరోవైపు జాతీయ పార్టీ బీజేపీ అర్బన్​లో సత్తా చాటాలని  భావిస్తున్నది.  వీలైనన్ని ఎక్కువ మున్సిపాలటీల్లో చైర్మన్​స్థానాలు దక్కించుకోవాలని ఇటీవల పార్టీ శ్రేణులకు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు దిశానిర్దేశం చేశారు. తాజాగా ఆ పార్టీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్​ జిల్లా  జమ్మికుంట, హుజూరాబాద్‌‌‌‌లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ ఎన్నికల హీట్‌‌‌‌ను పెంచారు.

చేరికలపై కాంగ్రెస్​ నజర్​

మున్సిపల్​ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ చేరికలపై ఫోకస్​ పెట్టింది.  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​, బీజేపీ నుంచి తాజా మాజీ,  ప్రస్తుత కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎవరొచ్చినా చేర్చుకోవాలని హైకమాండ్​ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఇతర పార్టీల్లోని బలమైన, ప్రజాభిమానంగల  నేతలను గుర్తించి చేర్చుకునేలా వ్యూహం రూపొందించారు. దీంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​, బీజేపీ నుంచి వచ్చేవారికి ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలుకుతున్నారు.

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌కు చెందిన 8 మంది బీఆర్ఎస్​ కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు ఆధ్వర్యంలో  హైదరాబాద్​ వచ్చి సీఎం రేవంత్​ సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. కార్పొరేటర్లు దనాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి, చిరుమామిళ్ల లక్ష్మి, గోళ్ల చంద్రకళ, డోన్వాన్​ సరస్వతి, గాదె అమృతమ్మ, మోతారపు శ్రావణి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను  వీడి కాంగ్రెస్‌‌‌‌ కండువా కప్పుకున్నారు. 

బీఆర్ఎస్ కార్పొరేటర్ల చేరికలను ఆపేందుకు బుధవారం హుటాహుటిన కేటీఆర్ ఖమ్మం వెళ్లినా.. ఆయన అక్కడికి చేరుకునేలోపే ఇక్కడ సీఎం సమక్షంలో మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో చేరికలు జరిగిపోయాయి.

మంత్రి వివేక్​ సమక్షంలోనూ.. 

మంచిర్యాల జిల్లా చెన్నూర్​ మున్సిపాలిటీలో బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు  మంత్రి వివేక్​ వెంకటస్వామి ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్​ పార్టీలో చేరారు. బీజేపీకి చెందిన చెన్నూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తుల సమ్మయ్య ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ కాయిత రాజేశ్వర్, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​కు చెందిన రైతు సమన్వయ సమితి మెంబర్ మద్దా మధుకర్, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ చెన్న రాజన్నతోపాటు మరో 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్  కండువా కప్పుకున్నారు. 

బీఆర్ఎస్​ బస్తీబాట..  

ఉద్యమ కాలం నుంచి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​కు పెద్దదిక్కుగా ఉన్న ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఫామ్‌‌‌‌హౌస్​కే పరిమితం కావడంతో పార్టీ కేడర్‌‌‌‌‌‌‌‌లో జోష్​ తగ్గింది. వర్కింగ్​ ప్రెసి డెంట్​హోదాలో కేటీఆర్ ​ముందుండి నడిపిస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు.  2023 తర్వాత జరిగిన ఏ ఒక్క ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గెలిచింది లేదు. వరుసగా జూబ్లీహిల్స్​  బైపోల్, పంచాయతీ ఎన్నికల్లో ఓటమితో తాజాగా జరగబోయే మున్సిపల్​ ఎన్నికలు బీఆర్ఎస్​కు జీవన్మరణ సమస్యగా మారాయి.  

ఇంకా ఎలక్షన్​ నోటిఫికేషన్​ రాకముందే ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమ దారి తాము వెతుక్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం జనగామలో పర్యటించిన ఆయన..​ బుధవారం ఖమ్మం చేరుకొని.. కేడర్‌‌‌‌‌‌‌‌లో  జోష్​ నింపే ప్రయత్నం చేశారు. కానీ కేటీఆర్​ పర్యటనకు కొద్ది గంటల ముందే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ పార్టీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. 

ఖమ్మం కార్పొరేషన్​లో ఒకప్పుడు 44 మంది కార్పొరేటర్ల బలగం ఉన్న బీఆర్​ఎస్​ పార్టీకి తాజా మార్పులతో కేవలం 14 మంది మాత్రమే మిగిలారు. ఇది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​కు మింగుడు పడడంలేదు. కాంగ్రెస్​ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి ఆ పార్టీ శ్రేణులు బస్తీబాటకు శ్రీకారం చుట్టారు. కాగా, శాసనమండలిలో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను బోనులో నిలబెట్టాయి.  మరోవైపు తెలంగాణ ఉద్యమకారుల నుంచి కూడా ఆ పార్టీకి వ్యతిరేకత వస్తున్నది. ఈ నేపథ్యంలో మున్సిపల్​ ఎన్నికలు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు  సవాల్‌‌‌‌గా మారనున్నాయి.

అర్బన్‌‌‌‌పై బీజేపీ గురి.. 

బీజేపీకి మొదటి నుంచీ 'అర్బన్ పార్టీ' అనే ముద్ర ఉన్నది. ఆ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది పట్టణప్రాంతాల్లో గెలిచిన వాళ్లే. మరోవైపు జీహెచ్ఎంసీపై కాషాయ జెండా ఎగరేయాలని కలలుగంటున్న ఆ పార్టీకి అంతకుముందు మున్సిపల్​ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం సవాల్‌‌‌‌గా మారింది. ఈ ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని భావిస్తున్న ఆ పార్టీ హైకమాండ్  మున్సిపల్​పోరును సీరియస్‌‌‌‌గా తీసుకున్నది.   

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులతో తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్​ ఎన్నికలపైనా ఇప్పటికే పలుమార్లు రివ్యూ నిర్వహించి పార్టీ శ్రేణులకు  దిశానిర్దేశం చేశారు. మరోవైపు  కరీంనగర్​ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్​ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు.  ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోని హుజూరాబాద్​, జమ్మికుంట మున్సిపాలిటీల్లో పర్యటించిన ఆయన  తమ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తే  ప్రజలకు అభివృద్ధి రుచిచూపిస్తామని చెబుతున్నారు.  

12న మున్సిపల్​ ఓటర్ల తుది జాబితా విడుదల 

రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించిన ఫైనల్​ ఓటర్ లిస్టులను ఈ నెల 12న విడుదల చేయాలని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ రాణి కుముదిని ఆదేశించారు. ​ ఈ మేరకు కలెక్టర్లు, మున్సిపల్​ కమిషనర్లతో బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్​ నిర్వ హించారు. 

ఓటర్ల తుది జాబితా, పోలింగ్​ స్టేషన్లవారీగా ముసాయిదా జాబితా విడుదల చేసి.. టీ పోల్‌‌లో అప్​లోడ్​ చేయడం, 16న పోలింగ్​ స్టేషన్ల వారీగా ఫొటోలతో ఓటర్ల తుది జాబితా ప్రకటించడంపై ఆదేశాలు ఇచ్చారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, రిటర్నింగ్, ఇతర అధికారులను నియమించాలన్నారు. పోలింగ్ సిబ్బంది నియామకం కోసం ఉద్యోగుల వివరాలను ‘టీ-పోల్‌‌’లో అప్‌‌డేట్ చేయాలని సూచించారు. 

‘మున్సిపల్’పై సీఎం రేవంత్​ స్పెషల్​ ఫోకస్ 

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలతోపాటు 66 శాతం పంచాయతీలను కైవసం చేసుకొని మంచి జోష్​ మీద  ఉన్న కాంగ్రెస్.. మెజారిటీ మున్సిపాలిటీలను  కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నది.  సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల హైదారాబాద్‌‌‌‌లో పీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్​​ కుమార్‌‌‌‌‌‌‌‌గౌడ్​తో కలిసి ఇన్​చార్జి మంత్రులతో సమీక్ష జరిపారు. 

గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరే షన్ల జాబితాలను తెప్పించుకొని పరిశీలించా రు. గతంలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచిం ది? చైర్​పర్సన్​ పీఠాలు ఎవరికి దక్కాయి? అని ఆరా తీశారు. పార్టీల సింబల్స్‌‌‌‌పై​ జరుగు తున్న ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, మెజారిటీ చైర్మన్​సీట్లు సాధిం చడానికి శాయశక్తులా కృషి చేయాలని ఆదేశించారు. 

తాను కూడా ప్రచారానికి వస్తానని, తన పర్యటన షెడ్యూల్‌‌‌‌ను త్వరలోనే  ప్రకటిస్తామని చెప్పారు.  సీఎం ఆదేశాలతో మున్సిపాలిటీల్లో ఇప్పటికే చేసిన అభివృద్ది పనులను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తున్నారు.  

బస్తీల్లో  ప్రోగ్రెస్‌‌‌‌లో ఉన్న వర్క్​లను సైతం ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చేలోపు కంప్లీట్​ చేసేలా ప్లాన్​ చేసుకుం టున్నారు.  అభ్యర్థుల ఎంపికకూ కసరత్తు ప్రారంభించారు. మరోవైపు బీసీలకు పార్టీ తరఫున 42 శాతం సీట్లు  కేటాయించాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు అందడంతో ఆ సామాజిక వర్గాలవారికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు.