మీ పిల్లలు ఫోన్ ఎప్పుడు చూస్తారు.. ఎంత సేపు చూస్తారు.. తినేటప్పుడు చూస్తారా..? స్కూల్ కి వెళ్లొచ్చాక చూస్తారా..? ఎందుకంటే ఫోన్ చూసే టైమ్ వాళ్ల పాలిట యమపాశంలా తయారవుతోంది. ఫోన్ తో పాటు వాళ్లు తినే తిండి తెలియకుండానే శరీరంలో విష గుళికలను తయారు చేస్తోంది. ఫోన్, ఆహారం ఈ రెండు చాలు.. పెద్దల్లో వచ్చే మహమ్మారి పిల్లల్లో రావటానికి. అదే టైప్2 డయాబెటిస్. టీనేజ్ కూడా దాటని పిల్లల్లో ఈ మహమ్మారి ఎలా ఎంటరైతుందో తెలుసుకుందాం.
ఈ రోజుల్లో కనీసం టీనేజ్ కూడా దాటని పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ వస్తుండటం పేరెంట్స్ లో తీవ్ర ఆందోళన కలిగించే అంశం. టైప్2 డయాబెటిస్ అంటే మధుమేహం , చక్కెర వ్యాధి అంటారు కదా.. అందులో ఇదో రకం. అయితే ఇది ఒక్క కారణంతో వస్తున్నది కాదు.. పిల్లల రోజువారి అలవాట్లు, ఏం తింటారు, ఎంత కదులుతారు, ఎంత సేపు ఆడతారు, ఫోన్ స్క్రీన్ తో ఎంత సేపు గడుపుతారు..? అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని పీడియాట్రిషియన్స్.. అంటే చిన్నపిల్లల డాక్టర్లు చెబుతున్నారు.
పోషకాహారం, స్క్రీన్ టైమ్, ఫిజికల్ యాక్టివిటీ.. ఈ మూడింటిలో బ్యాలెన్స్ తప్పడంతో పిల్లల్లో మెటబాలిజం.. అంటే జీవక్రియలో చాలా మార్పులు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఇంబ్యాలెన్స్ రానురాను ఇన్సులిన్ నిరోధకంగా మారి.. రెండో రకం మధుమేహానికి దారి తీస్తుందని అంటున్నారు.
స్క్రీన్ టైమ్ సైలెంట్ కిల్లర్..
టీవీ, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు లేదా గేమింగ్.. ఇలా స్క్రీన్ ఏదైనా ఎక్కువగా ఉపయోగించడం అంటే సాధారణంగా ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం. ఏ కదలిక లేకుండా కూర్చోవడం వలన బాడీలోప ఉన్న కేలరీలు కొద్ది వరకు మాత్రమే బర్న్ అవుతాయి. దీంతో ఎనర్జీలో అసమతుల్యత వస్తుంది.
శరీర బరువుపై జాగ్రత్తలు తీసుకోవడం, అందుకోసం వ్యాయామం చేయించినప్పటికి కూడా పిల్లలలో అధిక స్క్రీన్ సమయం కారణంగా ఇన్సులిన్ నిరోధకత అతిపెద్ద సమస్యగా డాక్టర్స్ చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం శరీరంలో చక్కెరను ప్రాసెస్ చేయడంపై ప్రభావితం చేస్తుందని అంటున్నారు. కదలకుండా.. ఎక్కువ సేపు కూర్చోవడం కారణంగా జీవక్రియ రేటును తగ్గిస్తుందని, దీని వలన పిల్లలకు బరువు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టమవుతుందని.. ఈ - రెండూ టైప్ 2 డయాబెటిస్‌కు కీలకమైన కారకాలని చెబుతున్నారు.
పిల్లల తిండిని స్క్రీన్‌లు ఎలా ప్రభావితం చేస్తాయి..?
స్క్రీన్ సమయం కేవలం కదలికను ప్రభావితం చేయడమే కాదు. తినే ఆహారపు అలవాట్లను కూడా ప్రభావితం చేస్తుంది. స్క్రీన్‌ల ముందు ఎక్కువ సమయం గడిపే పిల్లలు అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు, అలాగే చక్కెర-తీపి పానీయాలు అంటే కూల్ డ్రింక్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్ కు సంబంధించిన యాడ్స్ కు అట్రాక్ట్ అవుతారు. దీంతో పిల్లలు తమ ఇళ్లలో ఇలాంటి ఆహారమే కావాలని డిమాండ్ చేయడం చూస్తూనే ఉన్నాం. అంతే కాకుండా స్క్రీన్ చూస్తూ తినటం వలన ఎంత తిన్నాం, ఏం తిన్నాం అనేది కూడా అవగాహన లేకుండా ఒకసారి తక్కువగా..ఒకసారి ఎక్కువగా తింటారు. దీంతో తిన్న ఫీలింగ్ లేకుండా బాడీలో హార్మోన్స్ పై ప్రభావం చూపే వరకు వెళ్తుందట.
ఇలా అలవాటు పడిన పిల్లలు చివరికి.. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ అలవాటు పెరిగి అవి పండ్లు, కూరగాయల స్థానంలో చేరిపోతాయి. దీంతో వాళ్లు ఆరోగ్యమైన ఫుడ్ తీసుకునేకంటే యాడ్స్ లో చూపించే ఫుడ్స్ కు అలవాటు పడిపోతారు. ఫలితంగా బరువు పెరగడం,పేగు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీయడం, వాపు, ఇన్సులిన్ నిరోధకతను పెంచడం తెలియకుండానే జరిగిపోతుంటాయి.
నిద్రపై ప్రభావం.. హార్మోన్ల అసమతుల్యత:
రాత్రుళ్లు స్క్రీన్స్ చూడటం కారణంగా నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు అంటున్నారు. దీంతో హార్మోన్ల ఇంబ్యాలెన్స్ తో లేనిపోని సమస్యలు వస్తాయంటున్నారు. ముఖ్యంగా నీలి కాంతి అంటే స్క్రీన్స్ నుంచి బ్లూ లైట్ ఎన్నో మార్పులకు కారణం అవుతుందట. దీంతో నిద్ర సరిగా లేకపోవటం, ఆకలిని పరభావితం చేసే హార్మోన్లలో మార్పులు.. దీంతో యాడ్స్ లో చూపించే అలాంటి ఫుడ్ తినాలనే కోరికలతో.. పిల్లలు వాటికి అలవాటు పడతారని.. ఇది చిన్న తనంలోనే డయాబెటిస్.. అంటే ఒకరకమైన షుగర్ వ్యాధికి దారితీస్తుందని చెబుతున్నారు.
మార్చడం ఎలా..?
చిన్న చిన్న మార్పులతోనే ఇలాంటి ప్రమాదాల నుంచి పిల్లలను బయట పడేయవచ్చునని చెబుతున్నారు డాక్టర్లు. క్రమం తప్పకుండా శారీరక శ్రమను ప్రోత్సహించడం, గేమ్స్ ఆడించడం, స్క్రీన్ చూసే సమయాన్ని తగ్గిస్తూ.. వారిని వేరే అంశాలపైకి మళ్లించడం.. తినేటప్పుడు ఫోన్ లేదా టీవీ చూసే అలవాట్ల నుంచి దూరం చేయడంతో పిల్లల్లో ఎంతో మార్పు వస్తుందని అంటున్నారు. నిద్ర పోయే ముందు.. ముఖ్యంగా రాత్రి కాగానే పిల్లలకు ఫోన్, టీవీని దూరం చేస్తే మంచి నిద్ర ఉంటుందని.. దీంతో డయాబెటిస్ లాంటి మహమ్మారిని రాకుండా జాగ్రత్త పడవచ్చునని చెబుతున్నారు. మరి మీరు కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటారు కదూ..!
