హైదరాబాద్: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోలక్పూర్ న్యూ భాకారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం (జనవరి 7) రాత్రి వేళ అష్రాఫ్ ఐరన్ ట్రేడర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
ఫైరింజన్ల సహయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పక్కనే మరో మూడు స్క్రాప్ గోదాములు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల నివాస ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. మంటలు ఇతర గోదాములకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
►ALSO READ | గ్రేటర్ హైదరాబాద్ నాలుగు కమిషనరేట్ల పరిధిలో భారీగా డీసీపీల బదిలీలు
భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలను పరిశీలించారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
