సినీ తరహాలో ఛేజ్: నడి సముద్రంలో వెనిజులా చమురు నౌకను సీజ్ చేసిన అమెరికా

సినీ తరహాలో ఛేజ్: నడి సముద్రంలో వెనిజులా చమురు నౌకను సీజ్ చేసిన అమెరికా

వాషింగ్టన్: వెనిజులాపై అమెరికా ముప్పేట దాడి చేస్తోంది. ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‎ను అరెస్ట్ చేసిన అమెరికా.. తాజాగా ఆ దేశానికి చెందిన చమురు ట్యాంకర్‌ను సీజ్ చేసింది. రెండు వారాల అన్వేషణ తర్వాత ఎట్టకేలకు బుధవారం (జనవరి 7) ఉత్తర అట్లాంటిక్‌లో ఈ షిప్‎ను యూఎస్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించినందుకు ఫెడరల్ కోర్టు వారెంట్ మేరకు జస్టిస్ డిపార్ట్‌మెంట్, రక్షణ శాఖతో సమన్వయంతో ఆపరేషన్ చేపట్టి ఆయిల్ ట్యాంకర్‎ను నియంత్రణలోకి తీసుకున్నట్లు యుఎస్ ఆర్మీ యూరోపియన్ కమాండ్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 

అమెరికా స్వాధీనం చేసుకున్న ట్యాంకర్‌కు మొదట బెల్లా 1 అని పేరు పెట్టారు. ఇది వెనిజులా చమురు సరుకుల రవాణాకు ఉపయోగించే షిప్. అయితే.. ఈ నౌకను యూస్ బలగాలు లక్ష్యంగా చేసుకోవడంతో రష్యా రంగంలోకి దిగింది. ఈ నౌకను రష్యన్ రిజిస్ట్రీ కింద తిరిగి ఫ్లాగ్ చేసి మారినెరాగా పేరు మార్చారు. నౌకపై రష్యా జెండాను ఏర్పాటు చేసి మాస్కో నావికా దళాలు షిప్‎కు ఎస్కార్ట్‌గా పని చేశాయి. దాదాపు రెండు వారాలుగా ఈ నౌక కోసం అమెరికా తీవ్రంగా గాలించింది. 

►ALSO READ | మంచు కొండల్లో బద్ధలైన అగ్నిపర్వతం.. ఇంత అందమైన దృశ్యం మళ్లీ చూడలేమంటున్న శాస్త్రవేత్తలు!

రెండు వారాల అన్వేషణ తర్వాత బుధవారం (జనవరి 7) నౌక జాడను కనిపెట్టిన అమెరికా దళాలు.. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండా కలిగిన చమురు ట్యాంకర్ మారినెరాను స్వాధీనం చేసుకున్నాయి. అయితే.. రష్యన్ జెండా కలిగిన నౌకను యూఎస్ స్వాధీనం చేసుకోవడం   అమెరికా-రష్యా మధ్య ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉంది. 

ఇప్పటికే నౌకను సీజ్ చేయడంపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల అధికార పరిధిలో సక్రమంగా నమోదు చేయబడిన నౌకలపై బలప్రయోగం చేసే హక్కు ఏ రాష్ట్రానికీ లేదని రష్యా పేర్కొంది. రష్యన్ జెండా ఉన్న నౌకను స్వాధీనం చేసుకునే ఏ చర్య అయినా మాస్కోను నేరుగా వివాదాల్లోకి లాగడమేనని స్పష్టం చేసింది. రష్యన్ జెండా కింద పనిచేసే నౌకలతో జోక్యం చేసుకోవద్దని కూడా హెచ్చరించింది.