లేడీస్​హాస్టల్​లోకి అగంతకులు..బాత్రూంలోకి చొరబడి అసభ్యకర సైగలు

లేడీస్​హాస్టల్​లోకి అగంతకులు..బాత్రూంలోకి చొరబడి అసభ్యకర సైగలు
  • ఒకరిని పట్టుకున్న విద్యార్థినులు.. మరో ఇద్దరు పరార్​
  • సికింద్రాబాద్ పీజీ కాలేజీ ఎదుట స్టూడెంట్ల ధర్నా 
  • సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్​

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఓయూ పీజీ లేడీస్ హాస్టల్‌ వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ముగ్గురు అగంతకులు గోడదూకి హాస్టల్‌ ప్రాంగణంలోకి ప్రవేశించారు. బాత్రూమ్​లోకి చొరబడి అసభ్యకర సైగలు చేశారు. గమనించిన విద్యార్థినులు.. ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదారు. మరో ఇద్దరు పరారయ్యారు. 

సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్‌ వద్దకు చేరుకున్నారు. అగంతకున్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తుండగా విద్యార్థినులు వారిని అడ్డుకున్నారు. మిగిలిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కాలేజీ ఎదుట బైఠాయించి విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్ లో దాదాపు 250 మంది విద్యార్థినిలుండగా.. కేవలం ఒకే ఒక్క మహిళా వార్డెన్ మాత్రమే ఉన్నారని, హాస్టల్ వెనుక జరుగుతోన్న భవన నిర్మాణ కార్మికుల వల్ల కూడా ఇబ్బందిగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ విషయంపై వీసీ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రత్యేకంగా గస్తీ : నార్త్​జోన్​డీసీపీ రోహిణి

పీజీ కాలేజీలో విద్యార్థినులు ఆందోళనను విరమించారని నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.  హాస్టల్​లో ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రక్షణ విషయంలో కాలేజీ ప్రిన్సిపల్, వీసీతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితుడు గోడ దూకి లోపలికి ప్రవేశించాడని ప్రాథమికంగా తెలిసిందన్నారు. సమగ్ర దర్యాప్తు నిర్వహించిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని డీసీపీ పేర్కొన్నారు.