ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంచిర్యాల,వెలుగు: మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్​ హైస్కూల్​కు చెందిన పలువురు విద్యార్థులు ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన అథ్లెటిక్స్​ స్టేట్​ మీట్​లో సత్తా చాటారు. ఈ నెల 5, 6 తేదీల్లో 8వ తెలంగాణ స్టేట్​ సబ్ జూనియర్​అథ్లెటిక్స్ చాంపియన్​షిప్​ పోటీల్లో ఐదు గోల్డ్, ఒక సిల్వర్​, మరొక బ్రాంజ్​మెడల్​ సాధించి మంచిర్యాల జిల్లా ఓవరాల్​ చాంపియన్​షిప్​ సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. 50, 300 మీటర్ల రన్నింగ్​లో టి.కేతన్​ రెండు గోల్డ్​ మెడల్స్​, 300 మీటర్లలో సీహెచ్. జ్యోతి ర్మయి, యోగి, బ్రాడ్ ​జంప్​లో జాస్మిన్​గోల్డ్​ మెడల్స్ సాధించారు. సిద్ధార్థ బ్రాడ్​జంప్​లో సిల్వర్, సిరిజ్ఞ చౌదరి 100 మీటర్ల రన్నింగ్​లో బ్రాంజ్​ మెడల్​ సాధించించారు. విద్యార్థులను స్కూల్​ ప్రిన్సిపల్​ సిస్టర్​ రిన్సీ, వైస్​ ప్రిన్సిపల్​ అనూప, సిస్టర్​ లిల్లి, పీఈటీలు ఫ్రాన్సిస్​, అనిల్​, చిరంజీవి అభినందించారు.  


ఇక తెలంగాణలోనూ బీజేపీ సర్కారే

ఇచ్చోడ,వెలుగు:  తెలంగాణలో బీజేపీ సర్కార్​ఏర్పాటు కావడం ఖాయమని ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. గురువారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.  గుజరాత్ తరహలోనే తెలంగాణ ప్రజలు రామరాజ్యాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ గెలుపు ఖాయమన్నారు.

సంగ్రామ యాత్రతో టీఆర్ఎస్​కు భయం పట్టుకుంది

నిర్మల్/సారంగాపూర్​,వెలుగు: జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రతో టీఆర్​ఎస్​లీడర్లకు భయం పట్టుకుందని బీజేపీ పెద్దపల్లి ఇన్​చార్జి రావుల రాంనాథ్​పేర్కొన్నారు. గురువారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. పది రోజులపాటు 110 కిలో మీటర్ల పొడవున సాగిన బండి సంజయ్ పాదయాత్రకు జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారన్నారు. యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు.  సారంగాపూర్ మండలం బోరిగాంలోని శివాలయం, వీరబ్రహ్మేంద్రస్వామి  వేడుకలకు రాంనాథ్​ హాజరయ్యారు. దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.

మున్సిపల్ కార్మికులకు అండగాఉంటాం

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఆదిలాబాద్ మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ చెప్పారు. గురువారం స్థానిక వినాయక్ చౌక్ లో  మున్సిపల్ ఆఫీస్ వద్ద కార్మికులకు పాయల్ శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు, స్వెట్టర్లు పంపిణీ చేశారు. కార్మికులకు కనీసం ఆరోగ్య  బీమా, నెలనెల జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ర్ట ప్రభుత్వం ఉందన్నారు. కార్మికులకు తన తరపున ఆరోగ్య బీమా కల్పిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్​రెడ్డి, రవి, ప్రవీణ్, లాలా మున్నా, పాయల్ శరత్, దినేశ్​ మాటోలియ పాల్గొన్నారు.

 

కమిషనర్​ను సస్పెండ్​చేయాలని బీజేపీ ధర్నా

ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్​లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రస్వాగత ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడం దారుణమని స్థానిక బీజేపీ లీడర్లు పేర్కొన్నారు. గురువారం పట్టణంలో ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే రేఖానాయక్ ఒత్తిడి మేరకే మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలు తొలగించారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో పెంబి జడ్పీటీసీ భూక్యా జానుబాయి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రాజశేఖర్, లీడర్లు నాయిని సంతోష్, బుచన్న యాదవ్, మల్లయ్య, ప్రకాశ్, గోపాల్ డ్డి, శ్రావణ్, ఉపేందర్, గిరి, రవి తదితరులు పాల్గొన్నారు.


విద్యార్థులు భావితరాల శాస్ర్తవేత్తలుగా ఎదగాలి

ఆదిలాబాద్​ టౌన్,వెలుగు: విద్యార్థులు భావి శాస్త్ర వేత్తలుగా ఎదగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్​సూచించారు. గురువారం స్థానిక సెయింట్ జోసెఫ్​ కాన్వెంట్​హైస్కూల్​లో 50వ జిల్లాస్థాయి సైన్స్, గణిత, పర్యావరణ ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలు, సృజనాత్మకత వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్​లు ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వరుణ్​రెడ్డి, జడ్పీ  చైర్మన్ రాథోడ్​జనార్దన్, ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్​బాషా, సహాయ కలెక్టర్  పి.శ్రీజ, ఆర్డీవో రమేశ్​రాథోడ్, డీఈవో ప్రణీత పాల్గొన్నారు.

ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్​ ప్రారంభం


ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సై, కానిస్టేబుల్​ అభ్యర్థులకు గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్​హెడ్​క్వార్టర్స్ లో ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి సమక్షంలో ఫిజికల్ పరీక్షలు నిర్వహించారు. మొదటి రోజు 600ల మంది అభ్యర్థులకు గాను 493 మంది హాజరయ్యారు. వీరిలో 230 మంది క్వాలిఫై అయినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్​ ఎస్పీలు ఎస్.శ్రీనివాసరావు, సమయ్ జాన్ రావు, ఏఆర్ అడిషనల్​ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, ఉట్నూర్ ఏఎస్పి హర్షవద్దన్, డీఎస్పీలు వి.ఉమేందర్, ఎన్ఎస్వీ వెంకటేశ్వరరావు, ఎస్.ఉపేందర్, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
 

తరుగు పేరుతో మోసగిస్తే చర్యలు

బెల్లంపల్లిరూరల్: తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ భారతి హోళికేరి హెచ్చరించారు. గురువారం నెన్నెల మండలంలోని మైలారం, జోగాపూర్, చిత్తాపూర్​లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రాల్లోని బస్తాలను తూకం వేసి పరిశీలించారు. రైస్​ మిల్లర్లు మోసం చేస్తే మిల్లులను సీజ్​చేస్తామన్నారు. ఆమె వెంట ట్రెయినీ కలెక్టర్​గౌతమి, ఎంపీడీవో వరలక్ష్మి, ఏపీవో నరేశ్, ఏఈవో సుప్రజ తదితరులు ఉన్నారు.

బీజేపీ లీడర్ల సంబురాలు

గుజరాత్​అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చారు. ఒకరినొకరు స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తెలంగాణలోను ఇలాంటి ఫలితాలు రానున్నాయని నేతలు పేర్కొన్నారు.   - వెలుగు నెట్​వర్క్


సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

ముథోల్,వెలుగు: నేరాల నియంత్రణ కోసం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే సూచించారు. గురువారం ముధోల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. గ్రామంలోని ప్రతీ దుకాణం, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు వీడీసీ, సర్పంచులు సహకరించాలని కోరారు. పెండింగ్ కేసుల పరిష్కారం కోసం దృష్టిసారించాలని సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ముధోల్ సీఐ వినోద్ రెడ్డి, ఎస్సై తిరుపతి పాల్గొన్నారు.

కంచర్​బాయిలో కార్డన్​సెర్చ్​

దండేపల్లి,వెలుగు: మండలంలోని కంచర్​బాయిలో గురువారం మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో కార్డన్​సెర్చ్​నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సంఘ విద్రోహ శక్తుల మాయమాటలు నమ్మి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ప్రజలకోసమే పోలీసులు పనిచేస్తారన్నారు. కార్యక్రమంలో ఏసీపీ బిళ్ల తిరుపతి రెడ్డి, లక్సెట్టిపేట సీఐ కరీముల్లాఖాన్, దండేపల్లి, లక్షెట్టిపేట, జన్నారం ఎస్సైలు సాంబమూర్తి, లక్ష్మణ్, సతీశ్​పాల్గొన్నారు.

నిర్మల్ లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తాం

నిర్మల్,వెలుగు: నిర్మల్లో  రాష్ట్రస్థాయి క్రీడల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ఖోఖో క్రీడాకారులను గురువారం ఆయన స్థానికంగా సన్మానించారు. అంతకు ముందు బంగల్​పేటలో పద్మశాలి సంఘ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు.మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, కోచ్ కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, కౌన్సిలర్లు నవీన్, పద్మాకర్, కో ఆప్షన్ సభ్యుడు గోవర్దన్, మహాలక్ష్మి ఆలయ కమిటీ చైర్మన్​ గంగాధర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, నరసయ్య, జనార్దన్, అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు రాజేశ్వర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

రేపు ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవం  మంత్రులు కేటీఆర్, సబితా, అల్లోల రాక

నిర్మల్/భైంసా,వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవం ఈనెల 10న నిర్వహిస్తున్నట్లు ఇన్​చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. గురువారం ఆయన క్యాంపస్​లో మీడియాతో మాట్లాడారు. కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి, టెక్నాలజీ బిజినెస్ యూనిట్ రాజన్న హాజరవుతారని చెప్పారు. కాన్ఫరెన్స్ హాల్ లో విద్యార్థులకు ల్యాప్​ టాప్​ లు, యూనిఫాం, షూలు పంపిణీ చేస్తారన్నారు. తర్వాత పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేస్తారని వివరించారు. అనంతరం బ్రాంచీల వారీగా ప్రతిభ కనబర్చిన 38 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారని వెల్లడించారు. సమావేశంలో డైరెక్టర్ సతీశ్​కుమార్, డీన్​లు పావని, రామారావు, వినోద్, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు.

కార్మికుల సమస్యలు, ప్రైవేటీకరణపై చర్చకు రెడీ

నస్పూర్,వెలుగు: కార్మికుల సమస్యలు, ప్రైవేటీకరణపై బీజేపీ చర్చించడానికి సిద్ధంగా ఉందని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​వెరబెల్లి స్పష్టంచేశారు. గురువారం ఆయన నస్పూర్ ప్రెస్ క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. టీబీజీకేఎస్ లీడర్లు మాయమాటలతో కార్మికులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రగతి స్టేడియంలో సీఎం కేసీఆర్​ఇచ్చిన హామీలు నెరవేర్చే ధైర్యం ఆ పార్టీ 
లీడర్లకు ఉందా అని ప్రశ్నించారు. రామగుండంలో జరిగిన సభలో ప్రధాని సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని చెప్పినా.. కార్మికులను మభ్య పెట్టడానికి ప్రైవేట్ పరం చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సింగరేణి లేకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని సీఎం కేసీఆర్​తో చెప్పించాలని డిమాండ్​చేశారు. తాడిచర్ల బొగ్గు గనిని ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ చేస్తే గగ్గోలు పెట్టిన కేసీఆర్.. తెలంగాణ ఏర్పడ్డాకా.. సంస్థను ప్రైవేట్​పరం చేశారో చెప్పలన్నారు. బొగ్గు బ్లాక్ ల వేలంపై వితండవాదం ఆపి.. కార్మికులకు నిజాలు చెప్పాలన్నారు. పైరవీలకు అలవాడుపడ్డ లీడర్లు బీజేపీపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. లేదంటే కార్మిక సమస్యలు, బొగ్గు బ్లాక్ ల ప్రైవేట్ పరంపై ఎక్కడైనా చర్చకు రెడీగా ఉన్నామన్నారు. సమావేశంలో నస్పూర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు అగల్ డ్యూటీ రాజు, లీడర్లు పిట్టల రవి, రమేశ్, ఈర్ల సదానందం, పానుగంటి మధు, మిట్టపెల్లి మొగిలి, సామ్రాజ్ రమేశ్,  భీమయ్య, మల్క రాజేశం, కొండ వెంకటేశ్, కుర్ర చక్రవర్తి, రవనవేని శ్రీను, కొంతం మహేందర్, మద్ది సుమన్, తాడూరి మహేశ్, మాడిశెట్టి మహేశ్, విజయ్, మహిళా లీడర్ స్వప్నారెడ్డి  తదితరులు ఉన్నారు.

భారత్​ను విశ్వగురుగా నిలుపుతాం

నిర్మల్,వెలుగు: భారత్​ను విశ్వగురువుగా నిలిపే ప్రయత్నం చేస్తున్నామని.. తదర్వా సమాజంలో మానవతా విలువలు, దేశభక్తి పెంపొందుతుందని లీడ్ ఇండియా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సుదర్శన్ ఆచార్య చెప్పారు. స్థానిక విజయ హైస్కూల్ లో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న చేంజ్ ఏజెంట్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. దేశభక్తి గల పిల్లల చేతుల్లోనే భవిష్యత్​ఆధారపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరిలో నైతిక విలువలు, దేశభక్తి పెరిగితేనే దేశం పటిష్టంగా మారుతుందన్నారు. అంతకుముందు స్థానిక విజయ హైస్కూల్, ట్రస్మా ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన లీడ్ ఇండియా ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, రవి విద్యాసంస్థల అధినేత వెంకటేశ్వరరావు, నిర్మల్ టౌన్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రాగౌడ్, పద్మనాభ గౌడ్, ట్రెజరర్​ వినోద్, శ్రీనివాస్, గేమ్స్ సెక్రటరీ సాయన్న, విజయ హైస్కూల్ కరస్పాండెంట్, ధర్మ ప్రచార పరిషత్ జిల్లా బాధ్యుడు మంచిర్యాల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
 

వైద్యం చేయించుకోలేక మంచానికే..


మంచానికే పరిమితమైన ఈయన పేరు బసర్కార్​ దివాకర్. ఊరు కౌటాల మండల కేంద్రం. పుట్టుకతోనే సికిల్ సెల్, తలసేమియాతో బాధపడుతున్న ఆయన ఇప్పుడు పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. కొన్ని రోజుల క్రితం రెండు కిడ్నిలు, లివర్ చెడిపోవడంతో మంచంపై నుంచి లేవలేకపోతున్నాడు. కుటుంబ పోషణ, భర్త వైద్యం కోసం భార్య బసర్కార్​సులోచన స్కూళ్లు, కాలేజీల ఎదుట పల్లీలు, బఠాణిలు, పుట్నాలు అమ్ముతోంది. దీంతో ఆమెకు అన్నిపోను వంద రూపాయలు మిగులుతున్నాయి. భర్త వైద్యం కోసం నెలకు 8 నుంచి 10వేలు ఖర్చవుతున్నాయని.. మానవత్వం ఉన్న వారు స్పం దించి ఆదుకోవాలని సులోచన వేడుకుంటోంది. 
–కాగజ్ నగర్,వెలుగు
 

నకిలీ పర్మిషన్​ పేపర్స్​ సృష్టించిన ముగ్గురిపై కేసు​

  ముగ్గురిపై ఫోర్జరీ కేసు

నర్సాపూర్(జి), వెలుగు: అడ్డదారిన ఇంటి పర్మిషన్​ఇచ్చిన ముగ్గురిపై ఫోర్జరీ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సాపూర్(జి)కి చెందిన ఠాకూర్ జగదీశ్ ​సింగ్ నాలా కన్వర్షన్​లేని తన సొంత స్థలం లో ఇంటిని నిర్మించాడు. పంచాయతీ పర్మిషన్​కావాలని గ్రామానికి చెందిన ఠాకూర్ అర్జున్ సిం గ్, పరికిపండ్ల రవి, కారోబార్​చిన్నయ్యను సంప్రదిం చాడు. దీంతో వారు నకిలీ పత్రాలు సృష్టించి ఠాకూర్​జగదీశ్​సింగ్​కు ఇచ్చారు. అనుమతులు అన్ని ఉన్నాయని భావించిన సదరు జగదీశ్​సింగ్​ గురువారం ఇంటి నిర్మాణానికి లోను తీసుకుంటున్నానని, పేపర్ల మీద అటెస్టేషన్​ చేయాలని స్థానిక మేజర్​పంచాయతీ కార్యాలయానికి వెళ్లాడు. అసలు పర్మిషన్ ఇయ్యనప్పుడు సంతకాలు ఎలా పెడుతామని ఆఫీసర్లు జగదీశ్​తో పేర్కొన్నారు. పర్మిషన్​ ఇచ్చినట్లు పేపర్లు ఉన్నాయని చూపించడంతో సర్పంచ్​రాంరెడ్డి స్పందించి ఎంక్వైరీ చేయడంతో అసలు విషయం బయటపడింది. కొందరు నకిలీ అనుమతి పత్రాలు తయారు చేసి ఇచ్చినట్లు గుర్తించారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి గుండంపల్లి వీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు ఠాకూర్ అర్జున్ సింగ్, పరికిపండ్ల రవి, కారోబార్​ చిన్నయ్య ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి జగదీశ్​సింగ్​కు ఇచ్చినట్లు గుర్తించారు. పేపర్స్ తయారు చేసిన ముగ్గురిపై ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై పాకాల గీత తెలిపారు.
 

90 శాతం వికలాంగుడు.. అయినా పెన్షన్​ వస్తలే

తహసీల్దార్​ ఆఫీస్​ ఆవరణలో కూర్చున్న ఈయన పేరు సూరస్​ విఠల్. ఊరు కుభీర్​ మండలం లోని సాంగ్వి గ్రామం. 90 శాతం వికలాంగుడైన విఠల్​వయస్సు ఇప్పుడు 31 సంవత్సరాలు. పెన్షన్​ కోసం ఎనిమిదేళ్లుగా గవర్నమెంట్​ఆఫీస్​ల చుట్టూ తిరుగుతున్నాడు. కనిపించిన అధికారినల్లా వేడుకుంటున్నాడు. అయినా.. ఎవరి మనస్సు కరగడంలేదు. పెన్షన్​ మంజూరు చేయడంలేదు. పనిచేసి బతకడం కష్టంగా ఉందని.. ప్రజాప్రతినిధులు, కలెక్టర్​సారు స్పందించి పింఛన్​ మంజూరు చేసి ఆదుకోవాలని  కోరుతున్నాడు. – కుభీర్​,వెలుగు