
సుజాతనగర్, వెలుగు: కేరళలో జరగాల్సిన నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఆదివారం తెలంగాణలో జరిగింది. వైద్య విద్యలో పీజీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కాలేజీ, పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించారు. సుజాతనగర్ లో 119 మందికి 85 మంది, పాల్వంచలో 100 మందికి 47 మంది హాజరయ్యారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఎగ్జామ్ జరిగింది. మొదట కేరళలో ఎగ్జామ్ సెంటర్ ను కేటాయించగా అక్కడ నిఫా వైరస్ కారణంగా రద్దు చేసి తెలంగాణలో ఏర్పాటు చేశారు. అభ్యర్థులు మూడు రోజుల క్రితం డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టిక్కెట్లు తెలంగాణలో సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలియడంతో ఆందోళనకు గురైనట్లు పలువురు తెలిపారు. కేరళ, తమిళనాడు నుంచి కొందరు ఫ్లైట్స్ లో రాగా మరికొందరు కార్లలో వచ్చారు.
భాష రాక కొందరు, అడ్రస్ తెలియక మరికొందరు గందరగోళానికి గురయ్యారు. నిర్వాహకులు పరీక్షా కేంద్రం వద్ద ఒక్క నిమిషం నిబంధన అమలు చేశారు. అభ్యర్థులు ఎలాంటి మాస్కులు ధరించకుండా పరీక్షకు హాజరయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.