ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

మహబూబాబాద్ జిల్లా: మరిపెడ సబ్ ఇన్స్ పెక్టర్  శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. దళిత మహిళా ట్రైనీ ఎస్సైని లైంగికంగా వేధించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో  శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. మరిపెడ ఎస్.ఐ శ్రీనివాస రెడ్డిపై ట్రైనీ లేడీ ఎస్.ఐ తీవ్ర ఆరోపణలు చేశారు. నిన్న రాత్రి అడవిలోకి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేయబోయాడని, శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని కలసి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులతో కలసి పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసిన వైనం సంచలనం సృష్టించింది. దళితురాలు కాబట్టే అత్యాచారానికి ప్రయత్నించాడని ట్రైనీ లేడీ ఎస్.ఐ కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపించారు. న్యాయం చేయకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయనున్నట్లు ట్రైనీ మహిళా ఎస్.ఐ స్పష్టం చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నట్లు వరంగల్ సీపీ తరుణ్ జోషి ప్రకటించారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే ఎస్.ఐ శ్రీనివాస్ రెడ్డిపై చట్టపరమైన  చర్యలు తీసుకుంటామని ప్రకటించిన కొద్ది గంటల్లోనే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.