
- మహారాష్ట్రలో ఘటన
- తన తండ్రి జాడ చెప్పాలని పోలీసులను ఆశ్రయించిన వ్యక్తి కొడుకు
పుణె: మూడేండ్ల కిందట కనిపించకుండా పోయాడో వ్యక్తి.. తెలిసిన వాళ్లు, బంధువుల ఇళ్లల్లో వెతికినా కనబడలేదు. తాజాగా ప్రభుత్వ సంక్షేమ పథకానికి సంబంధించిన ఓ యాడ్ లో ఆ వ్యక్తి ఫొటో కనిపించింది. దీంతో అతని కొడుకు పోలీసులను ఆశ్రయించి తన తండ్రి ఆచూకీ చెప్పాలని కోరాడు. మహారాష్ట్రలో చోటుచేసుకుందీ ఆసక్తికర ఘటన. పుణె జిల్లా షిక్రాపూర్‌కు చెందిన జ్ఞానేశ్వర్ తాంబే (68) మూడేండ్ల కింద ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు.
ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బంధువుల ఇండ్లకు వెళ్లడం అలవాటు. కొద్దిరోజుల తర్వాత అతడు తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కొన్నిరోజులు వెతికినా ఫలితం లేకుండా పోవడంతో వదిలేశారు. కాగా.. ఇటీవల మహారాష్ట్రలోని ఏక్‌నాథ్‌షిండే ప్రభుత్వం వృద్ధుల కోసం ముఖ్యమంత్రి తీర్థ దర్శన్ యోజన పథకంను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 60 ఏండ్లు పైబడిన వారికి సబ్సిడీతో దేశవ్యాప్తంగా 66 తీర్థయాత్రలను సందర్శించడానికి వీలు కల్పిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన ఓ ప్రకటనపై జ్ఞానేశ్వర్ ఫొటో కనిపించింది. అధికార శివసేనకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలో అప్‌లోడ్ చేశారు.
దానిని జ్ఞానేశ్వర్ తాంబే కొడుకు భరత్తాంబేకు అతని స్నేహితుడు పంపించాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వెంటనే షిక్రాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అధికారులు, ప్రభుత్వం తన తండ్రి జాడ కనుక్కొని తమకు అప్పగించాలని భరత్తాంబే కోరాడు. అది అలంది నుంచి పంఢరీపూర్వెళ్తున్న భక్తుల పాదయాత్రలోని ఫొటో అయి ఉంటుందని ఆయన సూచించాడు. దీంతో పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ వివాదం తలెత్తడంతో ఆ సోషల్ మీడియా ఖాతా నుంచి ఆ ఫొటోను డిలీట్చేశారు. అలాగే, ఈ ఘటనపై ప్రభుత్వం స్పందిస్తూ.. అది ప్రభుత్వ ప్రకటన కాదని, అది ఏ అధికారిక ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాల నుంచి పోస్ట్ చేయలేదని పేర్కొంది.