
- గుట్టుగా అక్రమ రిజిస్ట్రేషన్లు
- రియల్టర్లతో సబ్ రిజిస్ట్రార్లు కుమ్మక్కు
- లేఅవుట్, ఎల్ఆర్ఎస్ రూల్స్ బ్రేక్
- తాజాగా మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా గుట్టుగా సాగుతోంది. సామాన్య ప్రజలను రూల్స్పేరుతో ముప్పు తిప్పలు పెట్టే ఆఫీసర్లు అధికార పార్టీ లీడర్లు, రియల్టర్ల విషయంలో మాత్రం అవన్నీ పక్కపెడుతున్నారు. లేఅవుట్, ఎల్ఆర్ఎస్, కొత్త మున్సిపల్ యాక్ట్రూల్స్ను బ్రేక్‌చేసి ఇష్టమొచ్చినట్లుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. తాజాగా వీటిపై కంప్లైంట్స్రావడంతో ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేసి జిల్లాలోని ఇద్దరు సబ్ రిజిస్ర్టార్లపై సస్పెన్షన్ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.
నిన్న మంచిర్యాలలో..
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధి తిమ్మాపూర్ శివారులోని 355 సర్వే నంబర్లో ఉన్న 847గజాల స్థలాన్ని మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ ఎన్.అప్పారావు గత నెలలో ముగ్గురు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. డాక్యుమెంట్ టు డాక్యుమెంట్ మాత్రమే చేయాల్సి ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా పార్టీషన్ చేశారు. లేవుట్, ఎల్ఆర్ఎస్, మున్సిపల్ యాక్టులను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్ తంతు పూర్తిచేశారు. ఈ విషయమై మెరుగు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. దీనిపై ఎంక్వైరీ చేసిన ఉన్నతాధికారులు నిజమని తేలడంతో సబ్‌రిజిస్ట్రార్.అప్పారావును సస్పెండ్‌చేస్తూ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ కరీంనగర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ రిజిస్ట్రార్ఆఫీస్లో సీనియర్అసిస్టెంట్గా పనిచేస్తున్న మురళిని మంచిర్యాల ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా నియమించారు. మంగళవారమే ఆర్డర్స్వచ్చినప్పటికీ ఆఫీసర్లు బయటికి చెప్పలేదు.
మొన్న లక్సెట్టిపేటలో..
మే11వ తేదీ అర్ధరాత్రి వరకు లక్సెట్టిపేట ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్ రతన్ 39 ఇల్లీగల్ రిజిస్ట్రేషన్లు చేశారు. లేవుట్, ఎల్ఆర్ఎస్, మున్సిపల్ యాక్ట్రూల్స్ బ్రేక్ చేసి రియల్టర్లకు లబ్ధి చేకూర్చారు. రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ ఇక్బాల్ లీవ్‌లో వెళ్లిన సమయంలో రియల్టర్లు రతన్‌ను పైసలతో ప్రలోభపెట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం సంచలనం కలిగించింది. కాంగ్రెస్, బీజేపీ లీడర్లు అడ్డుకోవడం, మీడియాలో వార్తలు రావడంతో ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేసి గత నెల 25న రతన్‌ను సస్పెండ్ చేశారు. అదే తరహాలో మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్ అప్పారావు తప్పు చేసి దొరికిపోయారు.
పార్టీషన్లకు పర్మిషన్ లేదు
ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పార్టీషన్రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేసింది. డాక్యుమెంట్ టు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్చేయడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఏడాదిగా పార్టీషన్రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో భూముల అమ్మకం, కొనుగోళ్లలో స్తబ్ధత నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొంతమంది ప్రజాప్రతినిధులు, లీడర్లు, రియల్టర్లు సబ్ రిజిస్ట్రార్లను పైసలు, పైరవీలతో లోబర్చుకుని గుట్టుగా తమ పని కానిచ్చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.