బేగంబజార్, వెలుగు: మహిళలు తమకు లభించే అవకాశాలను అందిపుచ్చుకుని, ఏ విషయంలోనూ వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తేనే విజయం లభిస్తుందని విశాక ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం సరోజా వివేక్ అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి కాలేజియేట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేనతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సరోజా వివేక్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడకూడదని, క్రమశిక్షణతో పనిచేస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చని సూచించారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే తాను ప్రస్తుతం విశాక ఇండస్ట్రీస్ ఎండీగా, అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్‌గా విజయవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం కమిషనర్ దేవసేన మాట్లాడుతూ.. పరీక్షల్లో ఫెయిల్ అయితే అదే జీవితం ముగింపు కాదని, అంతకంటే మెరుగైన అవకాశాలు వస్తాయని విద్యార్థుల్లో ధైర్యం నింపారు. తాను కూడా మొదట ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యానని, కానీ ఆ తర్వాత పట్టుదలతో చదివి ఐఏఎస్ సాధించానని తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కాలేజీ తొలి బ్యాచ్ విద్యార్థిని అయిన సరోజా వివేక్‌ను కమిషనర్, అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు బాలభాస్కర్, రాజేందర్‌సింగ్, కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.
