కరీంనగర్ సిటీ, వెలుగు:కరీంనగర్‌లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎల్లప్పుడూ సహకరించుకుంటాయని, ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ ఎన్నికతో మరోసారి రుజువైందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ డంపు యార్డు సమస్యపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఏడాది కింద కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను తీసుకొచ్చారని, కానీ డంప్ యార్డు సమస్య ఇప్పటికీ అలాగే ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అన్ని పనులు జరిగిపోయినట్టు ప్రజలకు భ్రమలు కల్పించి, ఇప్పుడేమో బాధ్యత లేనట్టు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నాయకులు ఎండీ తాజ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, వరాల నర్సింగం, మల్లేశం, జగన్ రెడ్డి పాల్గొన్నారు.

