నేటి నుంచి యాదాద్రిలో సుదర్శన యాగం

నేటి నుంచి యాదాద్రిలో సుదర్శన యాగం
  • మొదలు కానున్న మహా కుంభ సంప్రోక్షణ  

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రిలో సోమవారం నిర్వహించనున్న మహా కుంభ సంప్రోక్షణ పూజలతో ఆలయ ఉద్ఘాటన పర్వానికి తెరలేవనుంది. ఇందులో భాగంగా నేటి నుంచి 28 వరకు బాలాలయంలో పంచకుండాత్మక సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు స్వస్తి వచనంతో యాగం షురూ కానుంది. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశన రుత్విక్ వరుణం, అఖండజ్యోతి ప్రజ్వలన, వాస్తు పూజ, వాస్తుబలి, వాస్తు హోమం, వాస్తుపర్వగ్నకరణం నిర్వహించనున్నారు.

సాయంత్రం 6 గంటల నుంచి మృత్సంగ్రహణం, అంకురార్పణం, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన చేయనున్నారు. దీని కోసం బాలాలయంలో యాగశాలను సిద్ధం చేశారు. నలువైపులా నాలుగు ద్వారాలు, యజ్ఞకుండాలు ఏర్పాటు చేశారు. ఏడు రోజుల పాటు జరిగే సంప్రోక్షణ పూజలన్నీ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యుల పర్యవేక్షణలో జరుగుతాయని ఈఓ గీతారెడ్డి తెలిపారు.  28న జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్​ పాల్గొంటారని చెప్పారు. ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో మెయిన్ టెంపుల్ ను ఫైరింజన్ల సాయంతో శుభ్రం చేశారు. అష్టభుజి ప్రాకారాలు, మాడవీధులు, ఇన్నర్, ఔటర్ ప్రాకారాలను శుద్ధి చేశారు. మెయిన్ ​టెంపుల్ ​ముఖ మండపం, ఉపాలయాలను కడిగారు.  
భక్తులతో కిటకిట
ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట పట్టింది. కొండపైన పనులు కారణంగా వాహనాలను పోలీసులు పైకి అనుమతించలేదు. పాతగోశాలలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మహా కుంభ సంప్రోక్షణ పూజల నేపథ్యంలో యాదాద్రిలో నిత్య జరిగే ఆర్జిత సేవలు, స్వామివారి నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు రద్దు చేసి పాతగుట్ట నరసింహుడి ఆలయంలో నిర్వహిస్తున్నారు. దీంతో పాతగుట్ట సందడిగా మారింది. ఆదివారం ఆలయానికి రూ.19,54,982 ఆదాయం సమకూరింది. ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.7,86,850 ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.