
కోవిడ్ తర్వాత కార్డియాక్ అరెస్ట్(ఆకస్మిక గుండెపోటు) మరణాలు బాగా పెరిగాయి. కార్డియాక్ మరణాలకు కోవిడ్ టీకాలే కారణమని ప్రచారం సాగుతోన్న క్రమంలో ఇటీవల నిర్వహించిన అధ్యయనాలు సంచలన విషయాలను వెల్లడించాయి. కార్డియాక్ అరెస్ట్ మరణాలకు, కోవిడ్ ఎలాంటి సంబంధం లేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
కోవిడ్ టీకాలకు, పెద్దలలో గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జీవనశైలీ, ముందుగా ఉన్న ఆరోగ్య కారకాలే కారణమని తాజా అధ్యయనాలు బహిర్గతం అయినట్లు చెబుతోంది కేంద్రం.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ,AIIMS నిర్వహించిన అధ్యయనాల్లో కోవిడ్-19 తర్వాత దేశవ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తున్న ఆకస్మిక గుండెపోటుకు కరోనావైరస్ వ్యాక్సిన్లకు ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించాయి. జీవనశైలి ముందుగా ఉన్న పరిస్థితులను మరణాల వెనుక కీలకమైన కారకాలుగా ఉన్నాయని జాతీయ అధ్యయనాలు గుర్తించాయి.
19 రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాలలోని 47ఆస్పత్రుల్లో జరిపిన సుదీర్ఘ అధ్యయనాల తర్వాత బుధవారం (జూన్ 2) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖఈ ప్రకటన చేసింది. యువకులలో కోవిడ్-19 వ్యాక్సిన్లకు గుండెపోటుకు మధ్య ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో గుండె సంబంధిత మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లు కారణమై ఉండొచ్చని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటన చేసిన ఒక రోజు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.
అధ్యయనాల్లో ఏం తేలిందంటే..
18 నుంచి 45 యేళ్ల మధ్య వయస్సు యువకుల్లో ఆకస్మిక మరణాల వెనుక గల కారణాలను అర్థం చేసుకోవడానికి ICMR ,నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) కలిసి అధ్యయనాలు చేశాయి. 2023మే నుంచి ఆగస్టు వరకు 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 47 ఆస్పత్రుల్లో అధ్యయనాలు చేశారు. ఈ అధ్యయనం అక్టోబర్ 2021 , మార్చి 2023 మధ్య ఆరోగ్యంగా కనిపించి అకస్మాత్తుగా మరణించిన వ్యక్తులపై రీసెర్చ్ చేశారు.
"యువతలో ఆకస్మిక వివరణ లేని మరణాలకు కారణాన్ని స్థాపించడం" అనే శీర్షికతో రెండవ అధ్యయనాన్ని న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ICMR సహకారంతో నిర్వహించారు. కోవిడ్-19 వ్యాక్సిన్లు యువకులలో వివరించలేని ఆకస్మిక మరణ ప్రమాదాన్ని పెంచవని ఈ పరిశోధనలు తేల్చాయి.
జన్యుశాస్త్రం, జీవనశైలి, ముందుగా ఉన్న పరిస్థితులు ,కోవిడ్ అనంతర సమస్యలతో సహా అనేక రకాల కారణాల వల్ల ఆకస్మిక గుండెపోటుతో చనిపోయారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.