
సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘జటాధర’. సోనాక్షి సిన్హా విలన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. శనివారం ఈ చిత్రం నుంచి హీరోయిన్ దివ్య ఖోస్లా పాత్రను పరిచయం చేశారు. ‘ప్రతి చీకటికి ఒక నక్షత్రం అవసరం..’ అంటూ తను పోషిస్తున్న సితార క్యారెక్టర్ లుక్‌ను రివీల్ చేశారు.
లంగా వోణీలో ట్రెడిషనల్‌గా కనిపిస్తున్న ఆమె దేవాలయంపై శిల్పకళను చూస్తున్నట్టుగా ఉన్న ఈ వింటేజ్ బ్యాక్‌డ్రాప్ ఫొటో ఆకట్టుకుంది. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ప్రెర్ణా అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఇక మ్యూజిక్ వీడియోస్‌తో కెరీర్ ప్రారంభించిన దివ్య ఖోస్లా.. 2004లో వచ్చిన ఉదయ్ కిరణ్ సినిమా ‘లవ్ టుడే’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత బాలీవుడ్‌లో కెరీర్ కొనసాగించింది. టీ సిరీస్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్‌ను వివాహం చేసుకున్న ఆమె.. 2016లో వచ్చిన ‘సనమ్ రే’తో రీఎంట్రీ ఇచ్చింది. నటిగానే కాక నిర్మాతగానూ కొనసాగుతున్న ఆమె సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.