
రెగ్యులర్ స్టోరీలు కాకుండా ఇంటరెస్టింగ్ కాన్సెప్టుల్ని సెలెక్ట్ చేసుకోవడం సుధీర్ బాబు స్టైల్. త్వరలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే క్యూట్ లవ్‌స్టోరీతో రానున్నాడు. ఆల్రెడీ షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఇప్పుడు మరో సినిమా షూట్‌ని మొదలుపెట్టేశాడు సుధీర్. మహేష్ దర్శకత్వంలో వి.ఆనంద ప్రసాద్ నిర్మించే యాక్షన్ థ్రిల్లర్‌కి కమిటయ్యాడు. ఈ మూవీ రెగ్యులర్ షూట్‌ను నిన్న స్టార్ట్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఏప్రిల్ 23 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఈ చిత్రంలో అన్‌లిమిటెడ్ యాక్షన్ ఉంటుంది. సుధీర్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్, గోపరాజు రమణ, అజయ్ రత్నం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్‌తో సహా ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’ అన్నారు. ఆల్రెడీ ‘వి’ సినిమాలో సిన్సియర్ పోలీసుగా కనిపించాడు సుధీర్. ఈసారి ఖాకీ పవర్‌ని ఎలా చూపిస్తాడో మరి.