కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో జూన్ 11న దేశీయ స్టాక్ మార్కెట్లో షుగర్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అధిక శాతంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ విభాగం అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం.. 22 శాతం నుండి 30 శాతం వరకు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌కు ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుందంట.
ఈ నిర్ణయం వెలువడటంతోనే జూన్ 11 ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే షుగర్ స్టాక్స్ ఏకంగా 2.5% వరకు లాభపడ్డాయి. వీటిలో ధాంపూర్ షుగర్ మిల్స్ 3.5%, ద్వారికేష్ షుగర్ 2.7% పెరిగి అగ్రస్థానంలో నిలిచాయి. వీటితో పాటు బల్‌రామ్‌పూర్ చిని, బజాజ్ హిందుస్థాన్ షుగర్, దాల్మియా భారత్ షేర్లు కూడా 1.5% నుండి 2% వరకు లాభాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఈ పన్ను మినహాయింపు పొందాలంటే ఇథనాల్ బ్లెండింగ్ BIS ప్రమాణాలు(IS 19850)కి అనుగుణంగా ఉండాలి. ఉదాహరణకు 22% ఇథనాల్ పెట్రోల్‌లో.. 78% పెట్రోల్, 22% ఇథనాల్ ఉండాలి. అలాగే 30%ఇథనాల్ పెట్రోల్‌లో.. 70% పెట్రోల్, 30% ఇథనాల్ ఉండాలి. దీనివల్ల చక్కెర పరిశ్రమలకు ఇథనాల్ ద్వారా అదనపు ఆదాయం సమకూరనుంది.
భారత స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రముఖ ఇథనాల్ లింక్డ్ షుగర్ స్టాక్స్:
1. శ్రీ రేణుక షుగర్స్ లిమిటెడ్ (Shree Renuka Sugars)
2. బల్‌రామ్‌పూర్ చిని మిల్స్ లిమిటెడ్ (Balrampur Chini Mills)
3. త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ (Triveni Engineering)
4. ధాంపూర్ షుగర్ మిల్స్ లిమిటెడ్ (Dhampur Sugar Mills)
5. ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్ (EID Parry)
6. బజాజ్ హిందుస్థాన్ షుగర్ లిమిటెడ్ (Bajaj Hindusthan Sugar)
7. దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ (Dalmia Bharat Sugar)
8. ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Dwarikesh Sugar Industries)
9. ఉత్తమ్ షుగర్ మిల్స్ లిమిటెడ్ (Uttam Sugar Mills)
10. అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ (Avadh Sugar & Energy)
