ముగ్గురు కొడుకులున్నా ఎవరూ చూస్తలేరని వృద్ధ దంపతుల ఆత్మహత్య

ముగ్గురు కొడుకులున్నా ఎవరూ చూస్తలేరని వృద్ధ దంపతుల ఆత్మహత్య

దమ్మపేట వెలుగు: వారికి ముగ్గురు కొడుకులు. అల్లారుముద్దుగా పెంచారు. పెండ్లి చేశారు. రెక్కలు వచ్చాక కొడుకులు ఎవరి దారి వారు చూసుకున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ పెట్టలేకపోయారు. జబ్బు పడితే చూస్తూ ఉన్నారే తప్ప పలకరించలేకపోయారు. పట్టించుకునేవారు లేక మనస్థాపం చెందిన వృద్ధ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామానికి చెందిన దూబగుంట్ల నాగభూషణం(75), ఆదిలక్ష్మి (70)దంపతులకు ముగ్గురు కొడుకులు. ఓ కొడుకు వ్యాపారరీత్యా సత్తుపల్లిలో స్థిరపడ్డారు. మిగిలిన ఇద్దరు పట్వారిగూడెం గ్రామంలోనే విడిగా ఉంటున్నారు. వయసు మీద పడటంతో దంపతులు తరచూ అనారోగ్యానికి గురవుతుండేవారు. అయినప్పటికీ గ్రామంలోనే ఉన్న ఇద్దరు కొడుకులు వారిని కనీసం పలకరించేవారు కాదు. దీంతో మనస్థాపానికి గురైన దంపతులు శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం 9 గంటలైనా ఎవరూ బయటికి రాకపోవడంతో చుట్టుపక్కలవారు వెళ్లి చూశారు. దంపతులిద్దరూ ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. కొడుకులు సాయంత్రం పీఎస్​కు వెళ్లి కొంతకాలంగా తమ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేదని, అందుకే ఉరేసుకుని చనిపోయారని కంప్లయింట్​ఇచ్చారు.