
- ఈడీకి ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాత పాల్ ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: గతంలో రూ.14.4 లక్షల విరాళాలకు లెక్కలు చూపించలేదని కాంగ్రెస్‌కు నోటీసులు పంపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. రూ.4,617 కోట్లకు ట్యాక్స్ చెల్లించని బీజేపీకి ఎందుకు నోటీసులు పంపలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాత పాల్ ప్రశ్నించారు. శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే రూ.1,823.8 కోట్ల ఫైన్ చెల్లించాలని నోటీసుల్లో పేర్కొందన్నారు. ఇప్పటి వరకు రూ.130 కోట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిందని, ట్యాక్స్ విషయంలో కాంగ్రెస్‌కు ఒక న్యాయం, బీజేపీకి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ దేశంలో ట్యాక్స్ టెర్రరిజానికి పాల్పడుతున్నారని విమర్శించారు. మతతత్వ బీజేపీ నుంచి దేశాన్ని కాపాడేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాహుల్ గాంధీ అంటే భయపడుతుందని, అందుకే కాంగ్రెస్‌పై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తోందని విమర్శించారు.