ఎస్సీ గురుకుల స్టూడెంట్లకు సమ్మర్ క్యాంపులు

ఎస్సీ గురుకుల స్టూడెంట్లకు సమ్మర్  క్యాంపులు
  • 238  స్కూళ్ల నుంచి  1,176 మందికి ట్రైనింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ గురుకులాల్లో చదువుతున్న  స్టూడెంట్లకు సమ్మర్  క్యాంపు నిర్వహిస్తున్నారు. మొత్తం 238 స్కూళ్ల  నుంచి 1,176 మంది విద్యార్థులు ( గర్ల్స్ 710 , బాయ్స్ 466 ) ఈ వేసవి శిబిరంలో శిక్షణ పొందుతున్నారు. 8, 9వ తరగతి విద్యార్థులకు 15 రోజుల పాటు ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌‌లోని ఉప్పల్  బాలుర గురుకుల కాలేజీ, మల్కాజిగిరి  గర్ల్స్  ఫైన్  ఆర్ట్స్ స్కూల్ లో శిక్షణ ఇస్తున్నారు. పెయింటింగ్, మట్టితో కుండల తయారీ, డ్రాయింగ్, ఓపెన్  రైటింగ్, ఎంబ్రాయిడరీ, ఫొటోగ్రఫీ  అంశాలపై ట్రైనింగ్  ఇస్తున్నారు. 

 విద్యార్థులు తమకు నచ్చిన  విభాగాలను ఎంచుకుని ప్రాక్టికల్స్  శిక్షణ పొందవచ్చు. ఈనెల 6న సమ్మర్  క్యాంపులు ముగియనున్నాయి. సమ్మర్  క్యాంపును ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారి భవిష్యత్తుకు దోహదపడే కీలకమైన అడుగుగా సమ్మర్  క్యాంపులు నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు వేసిన వివిధ రకాల పెయింటింగ్స్, మట్టి పాత్రలతో చేసిన కళారూపాలను ఆమె పరిశీలించి స్టూడెంట్లను అభినందించారు.