న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాలు తీవ్రమైన వడగాల్పులతో అల్లాడుతున్న తరుణంలో ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవారం 'ఎక్స్' వేదికగా వరుస పోస్టులు చేసిన పీఎం.. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దైనందిన జీవితాన్ని కష్టతరం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చుట్టుపక్కల వారికి సాయం చేయాలన్నారు. పౌరులందరూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని కోరారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటిని తీసుకెళ్లాలని సూచించారు. తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో మానవత్వం ప్రదర్శించడం ముఖ్యమని పేర్కొన్నారు. దాహంతో ఉన్నవారికి గ్లాసు నీరు అందించి ఆదుకోవాలన్నారు. తమ ఇళ్లు, దుకాణాల బయట కుండల్లో నీరు ఉంచే వారిని అభినందించారు.
వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మధ్యాహ్నం వేళల్లో వారు బయటకు వెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పక్షులు, జంతువుల కోసం ఇళ్లు, బాల్కనీలు, పైకప్పులపై నీటి పాత్రలను ఉంచాలని కోరారు. ఆ చిన్న సాయం దాహంతో ఉన్న మూగజీవాలకు జీవనాధారంగా మారుతుందని పేర్కొన్నారు.
