తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఘనత

తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఘనత
  • ముంబైలోని లోక్ భవన్‌‌‌‌‌‌‌‌లో ప్రమాణ స్వీకారం
  • ప్రమాణం చేయించిన గవర్నర్ ఆచార్య దేవవ్రత్ 
  • ‘అజిత్‌‌‌‌‌‌‌‌ దాదా అమర్ రహే’ అంటూ నినదించిన ఎన్సీపీ సభ్యులు

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్  ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ముంబైలోని లోక్ భవన్‌‌‌‌‌‌‌‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఆమెతో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా చాలామంది ఎన్సీపీ మద్దతుదారులు ‘‘అజిత్‌‌‌‌‌‌‌‌దాదా అమర్ రహే.. వాహినీ సాహెబ్ ఆగే బడో, హమ్ తుమ్హారే సాథ్ హై’’ అంటూ నినదించారు.  సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే, ఇతర ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి  హాజరయ్యారు. రాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర రికార్డు నెలకొల్పారు.

గత బుధవారం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో సునేత్రా పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భర్త, నేషనలిస్ట్ కాంగ్రెస్​ పార్టీ చీఫ్​ అజిత్ పవార్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ విషాద ఛాయల మధ్యే ఈ కీలక పరిణామం జరిగింది. బుధవారం ఉదయం జరిగిన ఎన్సీపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో సునేత్ర పవార్‌‌‌‌‌‌‌‌ను పార్టీ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె పేరును సీనియర్ నేత ఛగన్ భుజబల్ ప్రతిపాదించగా, దిలీప్ పాటిల్, ఇతర ఎమ్మెల్యేలు బలపరిచారు. కాగా, సునేత్ర పవార్‌‌‌‌‌‌‌‌కు ప్రధాని మోదీ ‘ఎక్స్​’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆమె అవిశ్రాంతంగా కృషి చేస్తారనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. అజిత్ పవార్ ఆశయాలను ఆమె ముందుకు తీసుకెళ్తారని మోదీ ఆకాంక్షించారు.

2024లోనే క్రియాశీల రాజకీయాల్లోకి..

సునేత్ర పవార్ (62) గతంలో ఎక్కువగా సామాజిక సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యారు. అయితే 2024 లోక్ సభ ఎన్నికల నుంచి ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. బారామతి నియోజకవర్గం నుంచి తన వదిన సుప్రియా సూలేపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆమెను రాజ్యసభకు పంపడం ద్వారా 
అజిత్ పవార్  రాజకీయంగా ప్రాధాన్యత కల్పించారు. అజిత్ పవార్ హఠాన్మరణం తర్వాత పార్టీ పగ్గాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా, ఆమెనే రాజకీయ వారసురాలిగా ఎంపిక చేయాలని ఎన్సీపీ నేతలు నిర్ణయించారు. ప్రస్తుతం అజిత్ పవార్ మృతితో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ స్థానం నుంచి సునేత్రా పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉంది.

అజిత్​ మృతితో పార్టీల విలీనం ఆగింది: శరద్​ పవార్

 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాల విలీన ప్రక్రియపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 12న జరగాల్సిన విలీనం,  అజిత్ పవార్ అకాల మరణంతో నిలిచిపోయిందని పేర్కొన్నారు.  అజిత్ పవార్ మరణానంతరం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నిర్వహించిన మొదటి విలేకరుల సమావేశంలో శరద్​పవార్​మాట్లాడారు. గత 4 నెలలుగా విలీనంపై చర్చలు జరుగుతున్నాయని, రెండు వర్గాలు కలిసి రావాలని తాము కోరుకున్నామని పవార్ తెలిపారు. అయితే, అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఈ చర్చలకు ఆటంకం ఏర్పడిందని చెప్పారు.

డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణంపై కూడా శరద్​ పవార్ స్పందించారు.  పార్టీని నడిపించే ఒక బలమైన నాయకత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఆమె బాధ్యతలు చేపడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది తొందరపాటు నిర్ణయమా? కాదా? అనేది ఆ పార్టీ అంతర్గత విషయమని పేర్కొన్నారు.  దీనిపై తనకు ముందుగా సమాచారం లేదని తెలిపారు.