V6 News

సన్‌‌ ఫ్లవర్‌‌  కొనుగోళ్లపై సందిగ్ధం.. కేంద్ర కోటా పూర్తి కావడంతో నిలిచిన కొనుగోళ్లు

 సన్‌‌ ఫ్లవర్‌‌  కొనుగోళ్లపై సందిగ్ధం.. కేంద్ర కోటా పూర్తి కావడంతో నిలిచిన కొనుగోళ్లు
  • అదనపు కొనుగోళ్లకు రాని అనుమతి
  • సిద్దిపేట జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో 7 వేల మెట్రిక్‌‌ టన్నుల నిల్వలు
  •  20 రోజులుగా మార్కెట్‌‌ యార్డుల్లోనే రైతుల పడిగాపులు
  • ఇదే అదనుగా ధర తగ్గిస్తున్న ప్రైవేట్‌‌ వ్యాపారులు

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లాలో సన్‌‌ఫ్లవర్‌‌ కొనుగోళ్లపై సందిగ్ధత  నెలకొంది. మార్క్‌‌ఫెడ్‌‌ ఆధ్వర్యంలో నెల రోజుల కింద కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా.. పది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వ కొనుగోలు కోటా పూర్తి అయింది. దీంతో ఆఫీసర్లు పొద్దుతిరుగుడు కొనుగోళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని వివిధ మార్కెట్‌‌ యార్డుల్లో మరో 7 వేల టన్నుల సన్‌‌ఫ్లవర్‌‌ నిల్వలు ఉన్నాయి. అదనపు కొనుగోళ్ల కోసం కేంద్రం నుంచి అనుమతి వస్తేనే కాంటాలు ప్రారంభిస్తామని ఆఫీసర్లు చెబుతుండడంతో రైతులు మార్కెట్‌‌లోనే పడిగాపులు పడుతున్నారు.

20 రోజుల కిందే ఆగిన కొనుగోళ్లు..

యాసంగి సీజన్‌‌లో సిద్దిపేట జిల్లాలో 10 వేల ఎకరాల్లో సన్‌‌ఫ్లవర్‌‌ సాగు చేయగా.. ఎకరాకు ఆరు నుంచి పది క్వింటాళ్ల చొప్పున మొత్తం సుమారు 10 వేల మెట్రిక్‌‌ టన్నుల దిగుబడి వచ్చింది. సన్‌‌ఫ్లవర్‌‌ కొనుగోలు కోసం మార్క్‌‌ఫెడ్‌‌ ఆధ్వర్యంలో జిల్లాలోని సిద్దిపేట, తొగుట, చిన్నకోడూరు, హుస్నాబాద్, గజ్వేల్, బెజ్జంకి, మిరుదొడ్డిలో నెల రోజుల కింద కేంద్రాలను ప్రారంభించారు. పది రోజుల్లో సుమారు 2,200 మెట్రిక్‌‌ టన్నుల సన్‌‌ఫ్లవర్‌‌ను కొనుగోలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోటా మేరకు కొనుగోలు పూర్తి కావడంతో మార్క్‌‌ఫెడ్‌‌ ఆఫీసర్లు 20 రోజుల కింద కొనుగోళ్లను నిలిపివేశారు. 

మార్కెట్‌‌లో ఏడు వేల మెట్రిక్‌‌ టన్నులు..

మార్క్‌‌ఫెడ్‌‌ ఆఫీసర్లు సన్‌‌ఫ్లవర్‌‌ కొనుగోలు సెంటర్లను మూసివేయడంతో సిద్దిపేట జిల్లాలోని వివిధ మార్కెట్లలో సుమారు ఏడు వేల మెట్రిక్‌‌ టన్నుల నిల్వలు పేరుకుపోయాయి. తమ కోటా పూర్తి అయినందున ఇక తాము కొనుగోలు చేయలేమని, మిగతా పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మార్క్‌‌ఫెడ్‌‌ ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడడం లేదు. అయితే అదనపు కొనుగోళ్ల కోసం కేంద్రానికి లెటర్‌‌ రాశామని, అక్కడి నుంచి పర్మిషన్‌‌ వస్తే కొనుగోళ్లు మొదలుపెడుతామని మార్క్‌‌ఫెడ్‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో రైతులు 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు పడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి పంట కొనుగోళ్లను ప్రారంభించాలని కోరుతున్నారు.

ధర తగ్గిస్తున్న ప్రైవేట్‌‌ వ్యాపారులు

సన్‌‌ఫ్లవర్‌‌ కొనుగోళ్లు ఇరవై రోజులుగా నిలిచిపోవడంతో రైతులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్‌‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీనిని అదనుగా తీసుకున్న వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తున్నారు. క్వింటాల్‌‌ సన్‌‌ఫ్లవర్‌‌కు కేంద్ర ప్రభుత్వం రూ.7,721 మద్దతు ధర ప్రకటించింది. కానీ ప్రైవేట్‌‌ వ్యాపారులు మాత్రం క్వింటాల్‌‌కు రూ. 6 వేల లోపే చెల్లిస్తున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రచారం చేసి.. తీరా సన్‌‌ఫ్లవర్‌‌ చేతికొచ్చాక కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. 

అనుమతులు రాగానే కొనుగోలు చేస్తాం 

కేంద్ర ప్రభుత్వ టార్గెట్‌‌ ప్రకారం సన్‌‌ఫ్లవర్‌‌ను కొనుగోలు చేశాం. ప్రస్తుతం మార్కెట్‌‌లో పంట ఎక్కువగా ఉన్నందున అదనపు కొనుగోళ్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్లు రాశాం. ప్రభుత్వాల నుంచి అనుమతి రాగానే కొనుగోళ్లు ప్రారంభిస్తాం. మరో నాలుగైదు రోజుల్లో అనుమతులు వస్తాయని భావిస్తున్నాం. – సునీత, మార్క్‌‌ఫెడ్‌‌ డీఎం

సర్కార్ అనుమతి ఇస్తేనే కొంటామంటున్రు

మూడు ఎకరాల్లో సాగు చేసి, 20 క్వింటాళ్ల సన్‌‌ఫ్లవర్‌‌ను ఇరవై రోజుల కింద సిద్దిపేట మార్కెట్‌‌యార్డుకు తెచ్చాను. తెచ్చిన నాటి నుంచి అధికారులు చూసి పోతున్నారే తప్ప పట్టించుకోవడం లేదు. సన్‌‌ ఫ్లవర్‌‌ కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ కోటా పూర్తయింది, కొత్త కొనుగోళ్లకు అనుమతి వస్తేనే కొంటామని చెబుతున్నరు. ఇక్కడి పరిస్థితి చూస్తుంటే ప్రైవేట్‌‌ వ్యాపారులకే అమ్ముకుని పోవాల్సి వచ్చేలా ఉంది.– కంతుల రాజమల్లు, రైతు, రాఘవాపురం

20 రోజులుగా ఎదురుచూస్తున్న 

ఆరు ఎకరాల్లో సన్‌‌ ఫ్లవర్‌‌ సాగు చేసి, తొగుట మార్కెట్‌‌కు తీసుకొచ్చిన. పంట తెచ్చిన నాటి నుంచి అధికారులు వచ్చి చూసి వెలుతున్నారే తప్ప కొనుగోలు చేయడం లేదు. ఎందుకు కొనడం లేదని అడిగితే కోటా పూర్తయింది, అనుమతి వస్తేనే కొంటామని చెబుతున్నరు. ప్రతి రోజు యార్డుకు వచ్చి సన్‌‌ ఫ్లవర్‌‌ను ఆర బెట్టి మళ్లీ ఇంటికి వెళ్తున్న. రైతుల సమస్యను అర్థం చేసుకుని పంటను కొనుగోలు చేయాలి.– గొర్ల మల్లేశం, రైతు, తొగుట