బీజేపీ నేతలకు పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​ సునీల్ బన్సల్ పిలుపు

బీజేపీ నేతలకు పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​ సునీల్ బన్సల్ పిలుపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలన్న డిమాండ్​తో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఎమ్మెల్యేలు, మంత్రుల ఘెరావ్, ఇండ్ల ముట్టడిని సక్సెస్​చేయడంపై నేతలకు పలు సూచనలు ఇచ్చారు. ఆదివారం పార్టీ స్టేట్​ఆఫీస్​లో ఎన్నికల ఇన్ చార్జ్ ప్రకాశ్​ జవదేకర్, సంస్థాగత సహ ఇన్ చార్జ్ అరవింద్ మీనన్, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్​లో వచ్చే నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న బస్సు యాత్ర పై చర్చించారు. 

ఆదిలాబాద్ జిల్లాలోని బాసర, గద్వాల జిల్లాలోని అలంపూర్, కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం నుంచి  ఈ యాత్ర చేపట్టనున్నారు. తేదీల ఖరారు, ఎక్కడి నుంచి ఎవరు, ఎన్ని రోజులు చేపట్టాలనే దానిపై రాష్ట్ర నేతలతో చర్చించారు. దీనిపై మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ నెల 27న ఖమ్మంలో జరగనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభకు జన సమీకరణ, పార్టీలో కొందరు ముఖ్య నేతల చేరికలపైనా చర్చ జరిగింది. చేరికల విషయంలో గోప్యత పాటించాలని, వారి పేర్లను ముందే లీక్ చేస్తే చేరికలు ఆగిపోతాయని సమావేశంలో నేతలు వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీ ఇచ్చిన పలు ప్రోగ్రామ్ లు రాష్ట్రంలో ఏ మేరకు అమలు అవుతున్నాయనే దానిపై కూడా నేతలు రివ్యూ చేశారు.  ఆదివారం నుంచి  రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఎమ్మెల్యేల ప్రవాసీ ప్రోగ్రామ్,  ఎన్నికల్లో పార్టీ గెలుపు, అభ్యర్థుల ఎంపిక, జాబితా ప్రకటన వంటి అంశాలపైనా నేతలతో మాట్లాడారు.  

సోమవారం బీజేపీ అనుబంధ మోర్చాల నేతలతో సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు ఈటల రాజేందర్, ఇంద్రసేనారెడ్డి, పలువురు రాష్ట్ర ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు. అలాగే, డబుల్​ బెడ్రూం ఇండ్ల కోసం చేపట్టననున్న ఆందోళనలపై ఉద్యమ కమిటీ సమావేశమైంది. కమిటీ చైర్మన్, ఎంపీ​ లక్ష్మణ్​ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ ఇన్​చార్జి సునీల్​ బన్సల్​, కమిటీ సభ్యులు విజయశాంతి, ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​, మనోహర్​ రెడ్డి, చాడ సురేశ్​ రెడ్డి, ప్రేమేందర్​ రెడ్డి, తుల ఉమ పాల్గొన్నారు.