ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుపు సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. క్రికెట్ లవర్స్ తో పాటు సీనియర్స్ కూడా టీమిండియా స్టన్నింగ్ విక్టరీపై తమ అభిప్రాయాలు పంచుకుంటూనే ఉన్నారు. అయితే ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ గెలవటం మహిళా టీమ్ కు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ. ఈ గెలుపు పురుషులు గెలిచిన ఫస్ట్ వరల్డ్ కప్ కు ఏమాత్రం తీసిపోదని పోల్చుతున్నారు కొందరు.
మహిళల గెలుపును 1983 వరల్డ్ కప్ తో పోల్చడాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తప్పుపట్టారు. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళల టీమ్ సాధించిన విజయం అద్భుతమని కొనియాడిన ఆయన.. ఇండియా గెలుపుతో కొన్నేళ్లుగా డామినేట్ చేస్తూ వస్తున్న ఇతర జట్ల జైత్రయాత్రకు బ్రేక్ పడినట్లేనని అన్నారు.
అదే సమయంలో ఈ గెలుపును 1983 తో పోల్చడం కరెక్ట్ కాదని అంటున్నారు గవాస్కర్. ఆ టీమ్ తో ఈ టీమ్ ను పోల్చలేమని అన్నారు. 1983 టీమ్ కు నాకౌట్ దశలో ఆడిన అనుభవం లేదు. గ్రూప్ దశలో ఆడిన అనుభవంతోనే ఏకంగా ఫైనల్ లో గెలిచి కప్ అందుకోవడం మామూలు విషయం కాదు. కానీ మహిళల టీమ్ నాకౌట్ లో ఆడటం ఇది కొత్త కాదు. ఇంతకు ముందే గాల్స్ టీమ్ రెండు సార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఉందని అన్నారు.
1983 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ క్రికెట్ సత్తా ఏంటో తెలిసొచ్చింది. అందరూ మన టీమ్ ను గుర్తు పెట్టుకున్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా మహిళల విజయం అందరూ గుర్తు పెట్టుకుంటారు. ఇండియా ఉమెన్స్ టీమ్ అంటే ఇన్నాళ్లుగా ఉన్న అభిప్రాయం వేరు.. ఇప్పుడు వేరు .. అని అన్నారు. 1983 విన్.. పేరెంట్స్ ను ఎంకరేజ్ చేసింది. పిల్లలను క్రికెట్ కు పంపేలా ప్రోత్సహించింది. అని గవాస్కర్ తెలిపారు.
1983 వరల్డ్ కప్ ముందు వరకు భారత్ ఎపుడూ నాకౌట్ మ్యాచ్ ఆడలేదు. 1983 వరల్డ్ కప్ లో నాకౌట్ కు రావడమే కాదు.. పటిష్టమైన జట్లను ఒత్తిడిలో ఓడించి వరల్డ్ కప్ టైటిల్ అందుకుంది. ఐపీఎల్ భారత క్రికెట్ ను మరో లెవల్ కి తీసుకెళ్లింది. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలవడం ద్వారా క్రికెట్ మరో స్థాయికి వెళ్లడం ఖాయమని ఈ దిగ్గజ క్రికెటర్ 1983 వరల్డ్ కప్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఇండియా 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ టైటిల్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షెఫాలీ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది.
లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ వీరోచిత సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ ఆల్ రౌండ్ షోతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
