T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. మార్చి 5వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఇండియా జట్టు మేనేజ్మెంట్కు ఒక కీలకమైన సలహా ఇచ్చాడు. సాధారణంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను మూడు లేదా ఐదో ఓవర్లో బౌలింగ్‌కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దించుతున్నాడు. కానీ గవాస్కర్ అభిప్రాయం ప్రకారం, సెమీస్‌లో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాలంటే బుమ్రాను మొదటి ఓవర్ నుంచే బరిలోకి దింపడం మంచిదని వెల్లడించారు.
జస్ప్రీత్ బుమ్రా పవర్‌ప్లేలో కనీసం రెండు ఓవర్లు బౌలింగ్ చేయడం వలన జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ వంటి ప్రమాదకరమైన బ్యాట్స్మెన్లను ఆదిలోనే పెవిలియన్‌కు పంపించే అవకాశం ఉంటుందని సునీల్ గవాస్కర్ తెలిపారు. దీని వలన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలుతుంది అన్నాడు. బ్యాటర్లు క్రీజులో సెట్ అయ్యి, సుమారు 20 బంతులు ఎదుర్కొన్న తర్వాత మంచి రిథమ్‌లోకి వచ్చాక బుమ్రాను తీసుకురావడం కంటే, వారు క్రీజులోకి రాగానే బుమ్రాతో అటాక్ చేయించడం ఉత్తమమని తెలిపారు.
►ALSO READ | T20 World Cup: టీమిండియాకు ఐసీసీ షాక్.. సంజు శాంసన్ సెమీస్ ఆడకుండా నిషేధం?
బుమ్రా బౌలింగ్ శైలిని వివరిస్తూ గవాస్కర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీ, తన ప్రత్యర్థి బోరిస్ బెకర్ సర్వ్‌ను ఎలా డీకోడ్ చేశారో తన ఆత్మకథలో రాసుకున్నారు. కానీ బుమ్రా బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం కలిగిన్నప్పటికీ, డెలివరీకి ముందు దాన్ని గుర్తించడం బ్యాటర్లకు దాదాపు అసాధ్యం.. అందుకే అతడ్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలర్‌గా పరిగణిస్తారు. కాబట్టి, ఈ టోర్నమెంట్లో బుమ్రా గణాంకాలు కూడా గవాస్కర్ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. బుమ్రా ఇప్పటివరకు పవర్‌ప్లేలో కేవలం కొన్ని ఓవర్లు మాత్రమే వేసినప్పటికీ, 5 మ్యాచ్‌లలో 4 కీలక వికెట్లు పడగొట్టాడు.. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లకు ఐపీఎల్ ద్వారా భారత పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది.. కావునా వారు క్రీజులో కుదురుకోకముందే దెబ్బకొట్టడం భారత్‌కు గెలుపు తెచ్చి పెడుతుందని గవాస్కర్ చెప్పుకొచ్చారు.
అయితే దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచనలు పాటించాలా వద్దా అనేది ఇప్పుడు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పైనే ఉంది. గవాస్కర్ సూచించినట్టుగా బుమ్రాను మొదటి ఓవర్ నుంచే బరిలోకి దింపుతారా? లేదా పాత వ్యూహాన్నే అనుసరిస్తారా? అనేది తేలియాల్సి ఉంది. ముంబై పిచ్‌పై ఇంగ్లాండ్ పవర్ హిట్టర్లను అడ్డుకోవడంలో ఈ 'బుమ్రా టాక్టిక్' ఎంత వరకు పని చేస్తుంది అనేది వేచి చూడాలి.
