పార్టీ నాదే.. గుర్తూ నాదే

పార్టీ నాదే.. గుర్తూ నాదే
  • ఎక్కువ ఎమ్మెల్యేలు నా వెంటే ఉన్నారు : అజిత్ పవార్
  • పార్టీ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంలో చేరామని వెల్లడి
  • మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్​గా సునీల్ తట్కరే నియామకం
  • ప్రకటించిన పార్టీ సీనియర్ లీడర్ ప్రఫుల్ పటేల్

ముంబై: ‘‘గురు పౌర్ణమి సందర్భంగా శరద్ పవార్ మమ్మల్ని ఆశీర్వదించాలని మేమంతా కోరుకుంటున్నాం” అని అజిత్‌‌‌‌ వర్గంలోని సీనియర్‌‌ నేత ప్రఫుల్ పటేల్‌‌ అన్నారు. లోక్‌‌సభ సభ్యుడు సునీల్‌‌ తట్కరేను మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్​గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే జయంత్ పాటిల్ పూర్తి బాధ్యతలు సునీల్​కు అప్పగించాలని సూచించారు. సోమవారం ఉదయం అజిత్ పవార్​తో భేటీ అయిన ప్రఫుల్ పటేల్ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తర్వాత ఇద్దరూ కలిసి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటికెళ్లారు. పవర్ షేరింగ్ ఫార్ములాపై చర్చించారు. అదేవిధంగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ లీడర్లకు మంత్రిత్వ శాఖల కేటాయింపులపై మాట్లాడుకున్నారు. 

తర్వాత అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ కలిసి జాయింట్ ప్రెస్​మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ మాట్లాడారు. ‘‘ఎక్కువ మంది ఎన్సీపీ లీడర్లు, ఎమ్మెల్యేలు నా వెంటే ఉన్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనిమిది మందిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్​కు లేఖ రాయడంలో అర్థం లేదు. నోటీసు పంపడం సరికాదు. ఎన్సీపీ, పార్టీ గుర్తు గడియారం నా దగ్గరే ఉన్నాయి. మేము ఏం చేసినా పార్టీ ప్రయోజనాల కోసమే చేశాం. పార్టీని మరింత బలోపేతం చేస్తాం”అని అజిత్ పవార్ అన్నారు. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ అని మరిచిపోయారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఎదురు సమాధానం ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను స్పీకర్ నియమిస్తారని, పార్టీ కార్యకర్త కాదన్నారు.

పార్టీ నిర్ణయాలన్నీ సునీల్ తీసుకుంటరు..

జయంత్​ పాటిల్ స్థానంలో ఎంపీ సునీల్ తట్కరేను మహారాష్ట్ర స్టేట్ చీఫ్‌‌గా నియమిస్తున్నట్లు ప్రఫుల్ పటేల్ సోమవారం సాయంత్రం ప్రకటించారు. ఎన్సీపీ శాసన సభాపక్ష నేతగా అజిత్ పవార్ ఉంటారని తెలిపారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని వివరించారు. పార్టీ ఎమ్మెల్యేలు జయంత్ పాటిల్, జితేంద్ర అవద్​లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్​కు లేఖ రాశామన్నారు. జయంత్ పాటిల్ వెంటనే సునీల్​కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. పార్టీ పరంగా అన్ని నిర్ణయాలు సునీల్ తీసుకుంటారని స్పష్టం చేశారు.