- 47 రన్స్ తేడాతో సన్ రైజర్స్ పై రాయల్స్ గెలుపు
- రాణించిన వైభవ్, జురెల్, ఆర్చర్
ఐపీఎల్ లీగ్ దశలో పరుగుల సునామీ సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అసలైన మ్యాచ్‌లో తేలిపోయారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లను ఎదుర్కోలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ 47 రన్స్ తేడాతో రాజస్తాన్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. రాజస్తాన్ టీమ్ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ 29 బాల్స్‌లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 97 రన్స్ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
ముల్లన్‌పూర్: ఐపీఎల్–19 లీగ్ దశలో పరుగుల సునామీ సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అసలైన మ్యాచ్‌లో తేలిపోయారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లను ఎదుర్కోలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ 47 రన్స్ తేడాతో రాజస్తాన్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. వైభవ్ సూర్యవంశీ (29 బాల్స్‌లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 97), ధ్రువ్ జురెల్ (21 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) దంచికొట్టగా.. టాస్ ఓడిన రాజస్తాన్ 20 ఓవర్లలో 243/8 స్కోరు చేసింది.
తర్వాత హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 రన్స్‌కు ఆలౌటైంది. ఆర్చర్ (3/58) సూపర్ బౌలింగ్‌కు నితీశ్ కుమార్ (38), సలీల్ అరోరా (35), ఇషాన్ కిషన్ (33) మినహా మిగతా వారు నిరాశపర్చారు. వైభవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో రాజస్తాన్.. గుజరాత్‌తో తలపడుతుంది.
- ఓపెనర్లు ఉతికేశారు..
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకుండా ఎంత పెద్ద తప్పు చేశారో పవర్‌ప్లేలోనే హైదరాబాద్‌కు తెలిసొచ్చింది. సిక్స్‌తో ఖాతా తెరిచిన వైభవ్ భారీ హిట్టింగ్‌తో చెలరేగిపోయాడు. రెండో ఎండ్‌లో జైస్వాల్ ఫోర్లతో నిలకడగా ఆడాడు. రెండో ఓవర్‌లో సిక్స్ కొట్టిన వైభవ్.. కమిన్స్ వేసిన మూడో ఓవర్‌లో 4, 6, 6, 6తో 25 రన్స్‌తో ఉతికేశాడు. నాలుగో ఓవర్‌లో మరో రెండు సిక్స్‌లతో 16 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు.
తర్వాతి రెండు ఓవర్లలో మూడు ఫోర్లు రావడంతో రాయల్స్ పవర్‌ప్లేలో 80/0 స్కోరు చేసింది. 7వ ఓవర్‌లో జైస్వాల్ 4, వైభవ్ 4, 6తో 16 రన్స్ వచ్చాయి. ఇక 8వ ఓవర్‌లో 6, 4, 4, 6, 6తో 29 రన్స్ దంచిన వైభవ్ ఆఖరి బాల్‌కు ఔట్ కావడంతో సెంచరీ మిస్ అయ్యింది. తొలి వికెట్‌కు 125 రన్స్ పార్ట్‌నర్‌షిప్ కూడా ముగిసింది. ధ్రువ్ జురెల్ మెల్లగా ఆడినా.. జైస్వాల్ ఫోర్‌తో తొలి పది ఓవర్లలో రాజస్తాన్ 136/1 స్కోరుతో పటిష్ట స్థితికి చేరింది.
కానీ 11వ ఓవర్‌లో శివాంగ్ కుమార్ (1/19).. జైస్వాల్‌ను ఔట్ చేశాడు. ఇదే ఓవర్‌లో జురెల్ 6, పరాగ్ (26).. 6 దంచారు. 12వ ఓవర్‌లో జురెల్ 4, 6, 4తో పాటు మరో రెండు బౌండ్రీలతో 20 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. కానీ 14వ ఓవర్‌లో వెనుదిరగడంతో మూడో వికెట్‌కు 55 రన్స్ జతయ్యాయి. 15వ ఓవర్‌లో 4, 6 కొట్టిన పరాగ్‌ను తర్వాతి ఓవర్‌లో ప్రఫుల్ హింగే (3/54) ఔట్ చేసినా స్కోరు 207/3కి చేరింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ బౌలర్లు పట్టు బిగించారు. ఫోర్‌తో బ్యాటింగ్ మొదలుపెట్టిన షనక (5)ను 17వ ఓవర్‌లో ఈషాన్ మలింగ (1/40) ఔట్ చేయగా, 19వ ఓవర్‌లో ఫెరీరా (12), ఆర్చర్ (4) వెనుదిరిగారు. చివర్లో జడేజా (12 నాటౌట్) నిలబడినా, బర్గర్ (1) రనౌటయ్యాడు. చివరి ఐదు ఓవర్లలో 36 రన్సే వచ్చాయి.
- ఆర్చర్ దెబ్బ..
భారీ ఛేజింగ్‌లో హైదరాబాద్‌ను ఆర్చర్ తన తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఘోరమైన దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ రెండో బాల్‌కే అభిషేక్ శర్మ (0)ను ఔట్ చేశాడు. ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు బాదినా.. రెండో ఓవర్‌లో హెడ్ (17).. 6, 4 రాబట్టాడు. ఆర్చర్ వేసిన మూడో ఓవర్‌లో ఇషాన్ 4, 6, 6 కొట్టి క్యాచ్ ఔట్ నుంచి తప్పించుకున్నా.. ఐదో బాల్‌కు వికెట్ ఇచ్చాడు. నాలుగో ఓవర్‌లో స్మారన్ రవిచంద్రన్ (1)ను బర్గర్ (2/26) పెవిలియన్‌కు పంపాడు. ఐదో ఓవర్‌లో ఆర్చర్ దెబ్బకు హెడ్ వెనక్కి వచ్చేశాడు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్ 57/4తో కష్టాల్లో పడింది.
పవర్‌ప్లేలో 71/4 తో నిలిచిన హైదరాబాద్‌ను క్లాసెన్ (18), నితీశ్ కుమార్ ఆదుకునే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. ఏడో ఓవర్‌లో క్లాసెన్.. యష్ రాజ్ (1/39)కు వికెట్ ఇవ్వడంతో స్కోరు 81/5గా మారింది. నితీశ్‌తో కలిసిన సలీల్ అరోరా వేగంగా ఆడాడు. 9వ ఓవర్‌లో నితీశ్ 4, 6, 6.. 10వ ఓవర్‌లో సలీల్ 6, 4, 4 దంచడంతో ఫస్ట్ టెన్‌లో స్కోరు 132/5గా మారింది. కానీ 11వ ఓవర్‌లో నితీశ్ ఔట్ కావడంతో ఆరో వికెట్‌కు 56 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. కొద్దిసేపటికే కమిన్స్ (1) కూడా వెనుదిరిగాడు. అప్పటి వరకు బౌండ్రీలు బాదిన సలీల్‌ను 15వ ఓవర్‌లో జడేజా (2/21) దెబ్బకొట్టాడు. చివర్లో శివాంగ్ కుమార్ (27) మూడు ఫోర్లు కొట్టినా.. ఈషాన్ మలింగ (5)ను బర్గర్ ఔట్ చేయడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు:
రాజస్తాన్: 20 ఓవర్లలో 243/8 (వైభవ్ 97, జురెల్ 50, ప్రఫుల్ హింగే 3/54).
హైదరాబాద్: 19.2 ఓవర్లలో 196 ఆలౌట్ (నితీశ్ 38, సలీల్ 35, ఆర్చర్ 3/58).
- ఐపీఎల్ ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్ వైభవ్ (65*). 2012లో క్రిస్ గేల్ (59) నెలకొల్పిన రికార్డుని అధిగమించాడు.
- ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్ వైభవ్ (12*), గేల్ (10)ను వెనక్కి నెట్టాడు.
