భూగోళం మాదిరిగా మనకు నివాసయోగ్యమైన గ్రహం ఇంకోటి ఈ అనంత విశ్వంలో ఎక్కడైనా ఉందా? అనేది తెలుసుకునేందుకు దశాబ్దాలుగా సైంటిస్టులు అంతరిక్షంపై ఫోకస్ పెడుతూనే ఉన్నారు. తాజాగా అచ్చం భూమిలాగే ఉన్న మరో సూపర్ ఎర్త్ను సైంటిస్టులు కనుగొన్నారు. ఖగోళ శాస్త్రవేత్తలు అరుదైన ఘనత సాధించారు. నివాసయోగ్యమైన, భూమికి దగ్గరగా ఉన్న ఒక గ్రహాన్ని కనుగొన్నారు. GJ 251 c అనే ఈ గ్రహం భూమి నుంచి 20 కాంతి సంవత్సరాల కంటే తక్కువ దూరంలో ఉంది.
ఈ గ్రహం ఒక మరగుజ్జు సైజులో ఉండే నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. అక్కడ వాతావరణంలో భూమిపై ఉన్నట్టుగానే నీరు ద్రవ రూపంలో ఉండే అవకాశం ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. GJ 251 c భూమి కంటే నాలుగు రెట్లు బరువుగా.. పెద్దదిగా ఉంటుందని, ఈ గ్రహంపై ఎక్కువ భాగం రాతితో కూడుకుని ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ గ్రహాన్ని ‘సూపర్ ఎర్త్’ అని కూడా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు.
ఈ పరోశోధన గురించి.. ది ఆస్ట్రోనామికల్ జర్నల్‌లో వివరంగా ప్రచురించారు. పెన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృందం నేతృత్వంలో ఈ సరికొత్త ఆవిష్కరణ జరిగింది. గ్రహాంతర జీవుల అన్వేషణలో GJ 251 c వంటి గ్రహాలు కీలకమని పెన్ స్టేట్‌లోని ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ సువ్రత్ మహదేవన్ అన్నారు.
పెన్ స్టేట్‌లో నిర్మించిన హాబిటబుల్-జోన్ ప్లానెట్ ఫైండర్ (HPF), అరిజోనాలోని కిట్ పీక్ నేషనల్ అబ్జర్వేటరీలోని NEID స్పెక్ట్రోమీటర్ వంటి వివిధ పరికరాలతో ఈ పరిశోధన జరిగింది. ఈ రెండు పరికరాలు నక్షత్ర కాంతిలో జరిగే చిన్న మార్పులను పర్యవేక్షిస్తాయి. ఇవి కక్ష్యలో ఉన్న ఇతర గ్రహాల ఉనికిని సూచిస్తాయి. ఈ సందర్భంలోనే ఖగోళ శాస్త్రవేత్తలు GJ 251 నుంచి 54 రోజుల పునరావృత సంకేతాన్ని గుర్తించారు. ఇది తెలిసిన GJ 251 b వెలుపల కక్ష్యలో ఉన్న రెండవ గ్రహాన్ని ధృవీకరిస్తుంది. జెమిని నక్షత్రరాశిలో సుమారు 18 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న GJ 251 c, ఇప్పటివరకు కనుగొనబడిన నివాసయోగ్యమైన గ్రహాలలో ఒకటి.
ఇప్పటికే... అచ్చం భూమిలాగే ఉన్న సూపర్ ఎర్త్ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సైంటిస్టులు కనుగొన్న సంగతి తెలిసిందే. మనకు 137 కాంతి సంవత్సరాల దూరంలోని ఒక ‘అరుణ మరుగుజ్జు (రెడ్ డ్వార్ఫ్)’ నక్షత్రం చుట్టూ ఒక సూపర్ ఎర్త్ తిరుగుతోందని గుర్తించారు. ‘టీఓఐ71బీ’ అనే ఆ గ్రహం మన భూమి కన్నా ఒకటిన్నర రెట్లు పెద్దగా ఉందట. మన సూర్యుడు కాకుండా విశ్వంలోని ఇతర నక్షత్ర వ్యవస్థల్లో మన భూమి కన్నా పెద్దగా.. నెప్ట్యూన్, యురెనెస్ కన్నా చిన్నగా ఉండే గ్రహాలను సూపర్ ఎర్త్ అని పిలుస్తుంటారు.
‘టీఓఐ71బీ’ సూపర్ ఎర్త్ను ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్(టెస్) ద్వారా గుర్తించామని గతేడాది ఆరంభంలోనే నాసా వెల్లడించింది. మన సూర్యుడి కన్నా చిన్నగా, చల్లగా ఉండే నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతున్నట్లు తెలిపింది. భూమి మాదిరిగానే ఇది కూడా తన నక్షత్రం చుట్టూ జీవుల నివాసానికి అనుకూలమైనంత దూరం(హ్యాబిటేబుల్ జోన్)లోనే తిరుగుతోందని పేర్కొంది. ఈ సూపర్ ఎర్త్ కేవలం 19 రోజులకే ఒకసారి తన నక్షత్రాన్ని చుట్టి వస్తోందట. అంటే.. దీనిపై 19 రోజులకే ఒక ఏడాది గడిచిపోతుందట.
