న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మళ్లీ వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేయలేదు. దాంతో విచారణను కోర్టు సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.
ఈ సందర్భంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేయల్సి ఉంది. కానీ చేయలేదు. కేజ్రివాల్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. కావాలనే సీబీఐ కౌంటర్ దాఖలు ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) ఎస్వీ రాజు వాదిస్తూ..మరో వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు విన్నవించారు. ఏఎస్‌జీ విజ్ఞప్తి మేరకు సీబీఐ కౌంటర్ దాఖలుకు గడువు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
విచారణను సెప్టెంబర్ ఐదో తేదీకి వాయిదా వేసింది. కాగా..లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అవినీతి కేసులో సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌లను ప్రాసిక్యూట్ చేయడానికి అన్నిరకాల అనుమతి పొందినట్లు ఢిల్లీ కోర్టుకు సీబీఐ తెలియజేసింది.