కొంతమందిని జైలుకు పంపండి.. మిగిలినోళ్లకు అర్థమైతది.. పంట వ్యర్థాలను కాల్చే రైతులపై సుప్రీం ఆగ్రహం

కొంతమందిని జైలుకు పంపండి.. మిగిలినోళ్లకు అర్థమైతది.. పంట వ్యర్థాలను కాల్చే రైతులపై సుప్రీం ఆగ్రహం
  • అన్నం పెడుతున్నారని పర్యావరణాన్ని పాడుచేస్తామంటే ఊరుకోలేం
  • పంజాబ్, హర్యానా, యూపీ రైతుల  వల్ల ఢిల్లీలో ఎయిర్​ పొల్యూషన్​

న్యూఢిల్లీ, వెలుగు: రైతులు దేశానికి అన్నం పెడుతున్నారని పర్యావరణాన్ని పాడుచేస్తే చూస్తూ ఊరుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పంట వ్యర్థాల కాల్చివేత వల్ల ఢిల్లీ-ఎన్‌‌‌‌సీఆర్ ప్రాంతాల్లో తీవ్రమైన వాయు కాలుష్యం తలెత్తుతోందని, ఈ సమస్యను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రాన్ని ఆదేశించింది. 

పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్​లో పంట కోతల తర్వాత వ్యర్థాలను కాల్చే రైతులను అరెస్టు చెయ్యాలని, భారీ మొత్తంలో జరిమానాలు విధించాలని సూచించారు. ‘కొంతమంది జైలులో ఉంటే, అది మిగతా వారికి సరైన సందేశాన్ని పంపుతుంది’ అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. 

ఈ అంశంపై అమికస్ క్యూరీ అపరాజిత్ సింగ్ మాట్లాడుతూ.. పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఉండేందుకు రైతులకు సబ్సిడీలు, వివిధ పరికరాలు అందిస్తున్నప్పటికీ సమస్య తగ్గడం లేదన్నారు. దీనిపై ఎన్నిసార్లు ఉత్తర్వులు ఇచ్చినా ప్రయోజనం ఉండడంలేదన్నారు. రైతులు మనకు అన్నం పెడుతున్నారు కనుక వారు ప్రత్యేకమైనవారని, అలాగని పర్యావరణాన్ని పాడుచేస్తుంటే చూస్తూ ఊరుకోలేమని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టంచేశారు. పంట వ్యర్థాలను జీవ ఇంధనాలుగా ఉపయోగించవచ్చని వార్తల్లో చదివాను, గత ఐదేండ్లలో దీనిపై ఎందుకు కసరత్తు చేయలేదని సీజేఐ ప్రశ్నించారు.

పంజాబ్, హర్యానా చర్యలు తీసుకోవట్లేదు

పర్యావరణానికి నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ వినోద్ చంద్రన్ స్పందించారు. ఒకవేళ కఠిన చర్యలు ప్రవేశపెట్టడానికి ఇష్టపడకపోతే, అందుకు సంబంధించిన మాండమస్ ఉత్తర్వులు జారీ చేస్తామని సీజేఐ స్పష్టం చేశారు. పంజాబ్ తరఫున అడ్వకేట్ రాహుల్ మెహ్రా వాదనలు వినిపిస్తూ.. గతేడాదితో పోల్చితే పంట వ్యర్థాల దహనం తగ్గుముఖం పట్టిందని, ఈ ఏడాది మరింతగా కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అయితే అమికస్ క్యూరీ ఈ వాదనలతో విభేదించారు. పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు పంట వ్యర్థాలు తగలబెట్టకుండా చర్యలు తీసకోవడంలో ఫెయిల్​ అవుతున్నాయని.. 2018లోనే సుప్రీంకోర్టు విస్తృత ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు.

సీపీసీబీలను వెంటనే భర్తీ చేయాలి

కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌‌‌‌మెంట్ (సీఏక్యూఎం), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ), స్టేట్ పొల్యూషన్ బోర్డులు 3 వారాల్లో పొల్యూషన్​ మేనేజ్​మెంట్ ప్లాన్ తయారు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీలో 204 ఖాళీల్లో 83 మాత్రమే భర్తీ అయ్యాయని, మిగిలినవి సెప్టెంబర్‌‌‌‌ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సీఏక్యూఎంపై అక్టోబర్ 8న విచారణ ఉందని, రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు.