విచారణకు పెద్ద స్టేడియమే కావాలి: తమిళనాడు సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సుప్రీం ఆగ్రహం

విచారణకు పెద్ద స్టేడియమే కావాలి: తమిళనాడు సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ నిందితుడిగా ఉన్న క్యాష్ ఫర్ జాబ్స్‌‌‌‌‌‌‌‌ స్కామ్ కేసు విచారణలో భాగంగా తమిళనాడు సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు ఒక దశదిశ అంటూ లేకుండా సాగిందని వ్యాఖ్యానించింది. ‘‘ఈ కేసులో 2 వేల మందికి పైగా నిందితులు, 500 మంది సాక్షులు ఉన్నారు. బహుశా.. భారత్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక మంది విచారణలో పాల్గొన్న కేసు ఇదే అవుతుందేమో. అలాగే నిందితులందరినీ ప్రవేశపెట్టాలంటే ఈ కోర్టు రూమ్ కూడా సరిపోదు.. అందుకు ఒక క్రికెట్ స్టేడియం కావాలి” అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌‌‌‌‌‌‌‌మాల్యా బాగ్చీతో కూడిన బెంచ్ కామెంట్ చేసింది.

ఈ కేసులో నిందితులు, సాక్షులకు సంబంధించిన అన్ని వివరాలు అందజేయాలని ఆదేశించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించాలన్న విజ్ఞప్తిపై స్పందిస్తూ.. ‘మాజీ మంత్రి, పలుకుబడి ఉన్న వ్యక్తులు ఇందులో నిందితులుగా ఉన్నారు. కేవలం ఒక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయం చేయలేరు” అని పేర్కొంది. కాగా, అన్నాడీఎంకే హయాంలో రవాణాశాఖ మంత్రిగా ఉన్న సెంథిల్‌‌‌‌‌‌‌‌ బాలాజీ.. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగాల పేరిట కొందరి నుంచి లంచాలు తీసుకున్నారని కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన డీఎంకేలో చేరి మంత్రి అయ్యారు. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు.