న్యూఢిల్లీ: ఆలయంలోకి ప్రవేశించడానికి నిరాకరించిన క్రైస్తవ ఆర్మీ అధికారి తొలగింపును సుప్రీంకోర్టు సమర్ధించింది. ఆర్మీ ఒక సంస్థగా లౌకికమైనదని.. దాని క్రమశిక్షణలో రాజీ పడలేమని స్పష్టం చేసింది. ఇది సైనిక అధికారిగా అతను చేసిన అత్యంత దారుణమైన క్రమశిక్షణా రాహిత్యమని.. దీని ద్వారా అతను ఎలాంటి సందేశం పంపుతున్నాడని అసహనం వ్యక్తం చేసింది. అతని ప్రవర్తన చట్టబద్ధమైన ఆదేశాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది.
శామ్యూల్ కమలేసన్ 2017లో 3వ అశ్వికదళ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్‌గా భారత సైన్యంలో చేరారు. క్రైస్తవుడైన కమలేసన్ రెజిమెంట్‌లో నిర్వహించే హిందు మతపరమైన ఆచారాలలో పాల్గొనడానికి నిరాకరించారు. విగ్రహారాధనను నిషేధించే తన ప్రొటెస్టంట్ క్రైస్తవ విశ్వాసాలకు అనుగుణంగా రెజిమెంటల్‌లో జరిగే పూజ, హిందూ ఆరాధన ఆచారాన్ని నిర్వహించడానికి ఆలయం లోపలి గర్భగుడిలోకి ప్రవేశించడానికి ఆయన నిరాకరించారు.
దీంతో చట్టబద్ధమైన ఆదేశాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై శామ్యూల్‌ను 2021లో సర్వీస్ నుంచి తొలగించింది ఆర్మీ. అతనికి పెన్షన్ అర్హత, గ్రాట్యుటీ ప్రయోజనాలు లభించలేదు. దీంతో తన తొలగింపును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు శామ్యూల్ కమలేసన్. తిరిగి తనను ఉద్యోగంలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
రెజిమెంట్ తన మతపరమైన అవసరాల కోసం ఒక మందిరం, గురుద్వారాను మాత్రమే నిర్వహిస్తుందని, అన్ని విశ్వాసాలకు సర్వ ధర్మ స్థలం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆయన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. శామ్యూల్ కమలేసన్ తొలగింపును సమర్థించింది. ఆర్మీ నిర్ణయం సరైనదేనని, సైనిక క్రమశిక్షణకు మతపరమైన ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు శ్యామూల్ కమలేసన్. కానీ సుప్రీంకోర్టులో కూడా ఆయనకు చుక్కెదురైంది. శామ్యూల్ కమలేసన్ను సర్వీసు నుంచి తొలగించడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం సమర్థించింది. ఈ మేరకు కమలేసన్ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం.. సైన్యం ఒక సంస్థగా లౌకికమైనదని.. దాని క్రమశిక్షణలో రాజీ పడలేమని స్పష్టం చేసింది.
ఇది అత్యంత దారుణమైన క్రమశిక్షణా రాహిత్యమని.. అతని ప్రవర్తన చట్టబద్ధమైన ఆదేశాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఆయన అత్యుత్తమ అధికారి కావచ్చు కానీ భారత సైన్యానికి సరిపోరని.. తన తోటి (సిక్కు) సైనికుల విశ్వాసాన్ని గౌరవించనందుకు అతన్ని బహిష్కరించాలనే సాయుధ దళాల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
