భారతదేశంలో గృహిణుల శ్రమను గుర్తించే విషయంలో మన చట్టాలు, సామాజిక నిబంధనలు ఎంత వెనుకబడి ఉన్నాయో.. ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఇచ్చిన ఒక తీర్పు మరోసారి దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేపింది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించిన ఒక సాధారణ గృహిణి కుటుంబానికి అందించాల్సిన నష్టపరిహారాన్ని గణనీయంగా పెంచుతూ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
గృహిణులను కేవలం ఇంటి పనులకే పరిమితమైనవారిగా చూడలేమని, సమాజ అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో ఉందని పేర్కొంటూ వారిని ‘దేశాన్ని నిర్మించేవారు’ (నేషన్ బిల్డర్స్) అని కోర్టు అభివర్ణించింది. అయితే, ఈ తీర్పు ఎంతో ఆదర్శవంతంగా ఉన్నప్పటికీ, దీని వెనుక దాగున్న చేదు సామాజిక, ఆర్థిక వాస్తవాలు మన వ్యవస్థలోని అసమానతలను బట్టబయలు చేస్తున్నాయి.
ఒక మహిళ మరణించిన తర్వాత మాత్రమే ఆమె శ్రమకు ఒక నిర్దిష్ట ఆర్థిక విలువను కట్టడం, ఆ పరిహారాన్ని పురుషుడికి (భర్తకు) అందజేయడం జరిగింది. గృహిణి జీవించి ఉన్నప్పుడే కుటుంబ ఆర్థికవ్యవస్థకు పునాదిలాంటిది అని సమాజం గుర్తించడంలో ఇప్పటికీ వెనుకబడిందనే చెప్పాలి.
మన దేశంలో అధికారిక గణాంకాలు, ఆర్థిక విధానాలు గృహిణుల శ్రమను పూర్తిగా విస్మరిస్తున్నాయి. జాతీయ ఆదాయ గణనలు లేదా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లెక్కల్లో మహిళలు ఇళ్లల్లో చేసే పనులను అసలు ఉత్పాదక శ్రమగానే గుర్తించడం లేదు. గత జనాభా లెక్కల రికార్డులను పరిశీలిస్తే, గృహపనులు చేసే కోట్లాది మంది మహిళలను ‘పనిచేయని వారు’ (నాన్-వర్కర్స్) అనే వర్గంలో చేర్చి, వారిని సమాజంలో ఎలాంటి ఆదాయం లేని ఇతర వర్గాలతో సమానంగా నిలిపారు. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, మహిళల శ్రమ పట్ల వ్యవస్థకు ఉన్న పితృస్వామ్య దృక్పథానికి నిదర్శనం.
ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు 12గంటలకు పైగా గృహిణులు ఇంటిపనులు నిర్వహిస్తారు. వంట చేయడం, ఇల్లు శుభ్రపరచడం, పిల్లల విద్య, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, వృద్ధుల సంరక్షణ చూసుకోవడం వంటి ఎన్నో బాధ్యతలను గృహిణులు ఎలాంటి వారపు సెలవు లేదా వేతనం లేకుండా నిర్వహిస్తున్నారు. ఈ పనులన్నీ కుటుంబ ఉత్పాదకతను, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పరోక్షంగా నడిపిస్తున్నాయి.
రూ. వేల కోట్ల ఆర్థిక విలువజాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) గణాంకాల ప్రకారం.. ఒక భారతీయ మహిళ రోజుకు సగటున ఒక ఉద్యోగి పని గంటల సమయం కంటే ఎక్కువగా పనిచేసి, ఎలాంటి వేతనం లేని గృహ సేవలకు తన సమయాన్ని కేటాయిస్తోంది. అదే సమయంలో పురుషులు ఇందుకు కేటాయించే సమయం ఒక గంటన్నర కంటే తక్కువగానే ఉంటోంది. వివిధ అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం, భారతదేశంలో మహిళలు ఉచితంగా అందిస్తున్న ఈ గృహ శ్రమ ఆర్థిక విలువ ఏటా వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉంటుంది.
ఒకవేళ ఈ శ్రమ మొత్తాన్ని దేశ జీడీపీలో చేరిస్తే, మన ఆర్థికవృద్ధి రేటు ఊహించని స్థాయికి పెరుగుతుంది. అయినప్పటికీ, మార్కెట్ సూత్రాల ప్రకారం దేనికైతే నగదు రూపంలో చెల్లింపు జరగదో, దానికి విలువ లేదనే భావనతోనే మన ఆధునిక ఆర్థికవ్యవస్థలు నడుస్తున్నాయి. మహిళల ఈ ఉచిత శ్రమలో ‘కుటుంబంపై ప్రేమ, సంక్షేమం ఉన్నాయి. దీంతో పాటు దేశాభివృద్ధికి మూలమైన ఆర్థిక సంక్షేమం కూడా ఉంది. కుటుంబానికేకాదు దేశ ఆర్థిక వ్యవస్థకు గృహిణుల శ్రమే పునాది. కాబట్టి గృహిణుల శ్రమను గౌరవించడం, వారిని ఆర్థికశక్తులుగా ఆదరించడం సమాజం బాధ్యత.
ఆర్థిక గుర్తింపునివ్వాలి
ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీర్పును నిశితంగా పరిశీలించాల్సి ఉంది. ఒక గృహిణి రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు, మోటారు వాహనాల చట్టం కింద ఆమె కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని లెక్కించడానికి కోర్టులు ఒక ఊహాజనిత ఆదాయాన్ని ఖరారు చేస్తాయి. అంటే, ఆమె బతికి ఉన్నంతకాలం ఆమె శ్రమకు రూపాయి విలువ ఇవ్వని చట్టం, ఆమె మరణించాక ఆ శ్రమ లేకపోవడం వల్ల కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి లక్షల రూపాయల పరిహారాన్ని విధిస్తుంది.
ఈ పరిహారం భర్తకో లేదా మిగిలిన కుటుంబ సభ్యులకో ఆర్థికంగా ఉపయోగపడుతుంది తప్ప, ఆ శ్రమను నమ్ముకుని జీవితాన్ని ధారపోసిన సదరు మహిళకు ఎలాంటి న్యాయం చేయదు. ఘోరమైన ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయినప్పుడే చట్టం గృహిణి ఆర్థిక విలువను ఎందుకు గుర్తిస్తుంది? గృహిణులు సజీవంగా సేవలందిస్తున్నప్పుడే ఆమెకంటూ ఒక స్వతంత్ర ఆర్థిక గుర్తింపు లభించాలి.
- వెంకగారి భూమయ్య
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
