వికలాంగ బాలల కష్టాలకు న్యాయవ్యవస్థ స్పందించాలి : చంద్రచూడ్

వికలాంగ బాలల కష్టాలకు న్యాయవ్యవస్థ స్పందించాలి : చంద్రచూడ్

న్యూఢిల్లీ: వికలాంగ బాలల సమస్యలను అర్థం చేసుకుని వాటికి స్పందించేలా న్యాయవ్యవస్థ ఉండాలని సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్  డీవై చంద్రచూడ్  అన్నారు. పోలీసు స్టేషన్ల నుంచి కోర్టు రూముల దాకా వికలాంగ బాలల సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని ఆయన సూచించారు. బాలల సంరక్షణపై తొమ్మిదో నేషనల్  యాన్యువల్  స్టేక్ హోల్డర్స్  కన్సల్టేషన్  కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వికలాంగ బాలలు వారి శరీరంతో మాత్రమే కాకుండా మానసికంగానూ సవాళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు. 

వారి సమస్యల పరిష్కారానికి ‘రెస్టొరేటివ్  జస్టిస్  విధానం’ ప్రవేశపెట్టడం ఒక మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. లీగల్  సమస్యలు ఎదుర్కొంటున్న  పిల్లలకు కౌన్సెలింగ్  ఇవ్వడం, చదువు చెప్పించడం, వొకేషనల్  ట్రైనింగ్  ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాలని జువెనైల్  జస్టిస్  చట్టం పేర్కొంటుందని తెలిపారు. అలాగే వికలాంగ బాలలూ అభివృద్ధి రావాలంటే వారి కోసం అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ‘‘వికలాంగ బాలల గురించి మాట్లాడేటపుడు ‘ఇంటర్ సెక్షనాలిటీ’ భావనను తోసిపుచ్చలేం. లింగం, కులం, జాతి, సామాజిక ఆర్థిక హోదా వంటి గుర్తింపులకు అంగవైకల్యం అడ్డుగీత గీస్తుంది. దాంతో వికలాంగ బాలలు మరింత వివక్షను ఎదుర్కొనే పరిస్థితి వస్తున్నది. 

భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు వారిపై చాలా భయంకరమైన ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో వారి  ప్రయోజనాలు కాపాడేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మన వ్యవస్థలు ఆ బాలలకు సాధికారత కల్పించేలా ఉండాలి” అని సీజేపై పేర్కొన్నారు. వికలాంగ బాలల అవసరాలను ఇంకా చాలా సందర్భాల్లో వ్యక్తిగత అవసరాలుగానే చూస్తున్నామని, వారి అవసరాలను సామాజిక బాధ్యతగా చూడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన వ్యవస్థలు ఇంకా వారి అవసరాలను తీర్చలేకపోతున్నాయని గుర్తుచేశారు.