- తమ వద్ద లేరంటున్న ఏడీజీపీ మహేశ్ చంద్ర లడ్డా
- హిడ్మా ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్నారా..?
- మావోయిస్టుల కీలక లీడర్ లక్ష్యంగా కూంబింగ్
అమరావతి: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఎక్కడున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రపదేశ్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతమైన మారేడుమిల్లి టైగర్ ఫారెస్టులో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్ లో హిడ్మాతో పాటు ఆరుగురు మృతి చెందారు. ఈ క్రమంలో దేవ్ జీ ఎక్కడున్నారనే చర్చ ప్రారంభమైంది. దేవ్ జీ ఈ ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్నారా? లేక పోలీసుల అదుపులో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీపీ మహేశ్ చంద్ర లడ్డా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... దేవ్ జీ తమ అదుపులో లేరని ప్రకటించారు. దీంతో ఆయన ఎక్కడున్నారనే చర్చ మొదలైంది. తిప్పిరి తిరుపతి ఇవాళ తెల్లవారు జామున మరణించినట్టు ప్రచారం జరిగింది. కాగా ఉదయం ఎపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్ కౌంటర్ లో మరణించిన వారి పేర్లను వెల్లడించారు. మృతులంతా ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు. తమ ఆధీనంలో దేవ్ జీ లేరంటూనే.. నిన్నటి మారేడుమిల్లి ఎన్ కౌంటర్ నుంచి పలువురు తప్పించుకున్నారని, వారి కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నామని, పకడ్బందీగా గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. అయితే తప్పించుకున్న వారిలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఉన్నారా..? ఉంటే ఆయన ఎక్కడ తలదాచుకున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది.
9 మంది దేవ్ జీ సెక్యూరిటీ టీం అరెస్ట్
ఏపీలోని కాకినాడ, విజయవాడల్లో అరెస్టు చేసిన 31 మంది మావోయిస్టుల్లో 9 మందిని దేవ్ జీ సెక్యూరిటీ టీం సభ్యులుగా గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో దేవ్ జీ ఎక్కడున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా సెక్యూరిటీ టీం లేకుండా మావోయిస్టు పార్టీ చీఫ్ ఉండరనే టాక్ ఉంది. సెక్యూరిటీ టీం సభ్యులు అరెస్టు అయితే దేవ్ జీ ఈ అరెస్టు నుంచి తప్పించుకున్నారా? లేక పోలీసుల అదుపులో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఆయన టీం సభ్యులు మాత్రమే షెల్టర్ లో ఉంటే దేవ్ జీ మరో చోట భద్రంగా ఉన్నారా? అనే చర్చ కూడా ఉంది. మావోయిస్టు పార్టీ చరిత్రలో పలువురు ముఖ్యనాయకులు పోలీసు వలలో చిక్కుకుని తృటిలో తప్పించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అదే కోవలో దేవ్ జీ తప్పించుకొని ఉంటారా..? అన్న చర్చ కూడా ఉంది.
