లేడీ సూపర్ స్టార్ నయనతార 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ రోజు తన జన్మదిన ( నవంబర్ 18న ) వేడుకలను భర్త విఘ్నేశ్ శివన్, కవల కుమారులు ఉయిర్, ఉలగ్ తో కలిసి నిరాడంబరంగా జరుపుకున్నారు. సందర్బం వచ్చినప్పుడల్లా స్పెషల్ గిఫ్ట్ తో సయనతారకు విఘ్నేశ్ శివన్ తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఈసారి తన భార్య పుట్టిన రోజుకు ఇచ్చిన ఖరీదైన బహుమతి సినీవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రతి ఏటా లగ్జరీ కార్ల బహుమతి
ప్రతి సంవత్సరం తన భార్యకు లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. విఘ్నేశ్ శివన్ ఈసారి ఏకంగా రూ.10 కోట్ల విలువైన కొత్త రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ కారును బహుమతిగా ఇచ్చి నయనతారను ఆశ్చర్యపరిచారు. విఘ్నేశ్ శివన్ తన ప్రేమను వ్యక్తం చేయడానికి లగ్జరీ వాహనాలను ఎంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత మూడు సంవత్సరాల నుంచి ఆయన నయనతారకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇస్తూనే ఉన్నారు. 2023 మెర్సిడెస్-మేబ్యాక్ కారును బహుమతిగా ఇచ్చారు. దీని విలువ అప్పట్లో సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వచ్చాయి. 2024లో భర్త నుంచి మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600ను నయన్ అందుకున్నారు. దీని విలువ దాదాపు రూ.5 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక ఈ ఏడాది ఆ విలువను డబుల్ చేస్తూ, ఏకంగా రూ.10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెళ్లి ప్రయాణం
నయనతార, విఘ్నేశ్ శివన్ ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. తర్వాత 2022 జూన్‌లో చెన్నైలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రైవేట్ వేడుకకు రజినీకాంత్, షారుఖ్ ఖాన్, అట్లీ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరి వివాహ వేడుకను 'బియాండ్ ది ఫెయిరీ టేల్' పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా కూడా రూపొందించింది. అదే ఏడాది, ఈ జంట సరోగసీ ద్వారా కవల కుమారులను స్వాగతించారు. వారికి ఉయిర్ రుద్రోనీల్ ఎన్ శివన్ , ఉలగ్ దైవగన్ ఎన్ శివన్ అని పేర్లు పెట్టారు. 'N' అంటే ప్రపంచంలోనే అత్యుత్తమ తల్లి అయిన నయనతార అని 2023లో విఘ్నేశ్ శివన్ ప్రకటించారు.
►ALSO READ | ఐ బొమ్మ రవికి ఆదరణెందుకు.?.మధ్యతరగతి దేవుడంటూ పోస్టులు..ఠాగూర్ లో చిరంజీవి లెవల్ లో తారీఫ్
బాలయ్య సరసన నయన్
నయనతార పుట్టినరోజు సందర్భంగా.. కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చింది. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'NBK111' చిత్రం నుంచి నయనతార ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. "సముద్రాల ప్రశాంతతను, తుఫానుల ఆగ్రహాన్ని మోసే రాణి, నయనతార #NBK111 సామ్రాజ్యంలోకి అడుగుపెడుతోంది. టీమ్ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు. చారిత్రక గర్జన లోడింగ్... భారీ అప్‌డేట్‌లు త్వరలో వస్తాయి" అని ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించబడలేదు. ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
