దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ , మలయాళం సినీ పరిశ్రమలో ఎన్నో మరుపురాని పాత్రలు పోషించిన సీనియర్ నటి తులసి తన సుదీర్ఘ నట ప్రస్థానానికి ముగింపు పలికారు. డిసెంబర్ 31న అధికారికంగా నటనకు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు . అనూహ్యంగా తులసి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సినీ వర్గాలను , అభిమానులు ఆశ్చర్యానికి గురిచింది.
నా జీవితం సాయిబాబాకు అంకితం!
తన రిటైర్మెంట్ జీవితం ఇక షిరిడీ సాయిబాబాకు అంకితం చేస్తున్నట్లు తులసి తెలిపారు. ఈ డిసెంబర్ 31న షిరిడీ దర్శనం కొనసాగింపుగా .. నేను సంతోషకరమైన రిటైర్మెంట్ ను కోరుకుంటున్నాను. సాయి నాథునితో శాంతియుతంగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను అని ఆమె పోస్ట్ చేశారు. జీవితాన్ని నేర్చుకోవాడానికి నాకు సహాయం చేసిన మీ అందరకి ధన్యవాదాలు .. సాయిరామ్ అంటూ అభిమానులకు భావోద్వేగ సందేశం ఇచ్చారు తులసి.
బాలనటిగా అరంగ్రేటం..
తులసి 1967లో బాలనటిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 1974లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ' ఆరంగేట్రం'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, కన్నడ, తమిళం , మలయాళం, భోజ్ పురి భాషల్లో ఇప్పటివరకు 300లకు పైగా చిత్రాల్లో నటించిన ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు ప్రేక్షకులకు ఆమె బాలనటిగా కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన క్లాసిక్ చిత్రం ‘శంకరాభరణం’తో ఎనలేని కీర్తిని సంపాదించారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన ‘శుభలేఖ’ సినిమాలో సుధాకర్‌కు జోడీగా నటించి హీరోయిన్‌గా మెప్పించారు. కన్నడ దర్శకుడు శివమణిని వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం విరామం తీసుకున్నా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చారు.
ఇండస్ట్రీకి 'అమ్మ'గా గుర్తింపు
రీ ఎంట్రీ తర్వాత ఆమె పరిశ్రమలోని దాదాపు సగం మంది హీరోలకు తెరపై తల్లి పాత్రలు పోషించి 'అమ్మ'గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇటీవలి కాలంలో వెంకటేష్ హీరోగా వచ్చిన 'F3'లో సవతి తల్లిగా, అలాగే కొన్ని ప్రభాస్ చిత్రాల్లోనూ కనిపించారు. ఆమె పాత్రలు ప్రేక్షకులకు ఒక సుపరిచితమైన, ఆత్మీయ అనుభూతిని ఇచ్చేది. కొన్ని సంవత్సరాలుగా ఆమె పాత్రల సంఖ్య తగ్గుతూ వచ్చినప్పటికీ, ఈ విధంగా డిసెంబర్ 31న ఒక 'ఫైనల్ డేట్' ప్రకటించి వీడ్కోలు పలకడం ఇండస్ట్రీని ఆశ్చర్యానికి, కొంత భావోద్వేగానికి గురిచేసింది. తన జీవితాన్ని దైవానికి అంకితం చేస్తూ ఆమె తీసుకున్న ప్రశాంతమైన ఈ నిర్ణయాన్ని అభిమానులు ఆశీస్సులు, ప్రేమతో అంగీకరిస్తున్నారు.
