నీట్ పేపర్ లీక్ నిజమే.. సుప్రీంకోర్టు

నీట్ పేపర్ లీక్ నిజమే.. సుప్రీంకోర్టు
  • రీ టెస్ట్ అనేది లాస్ట్ ఆప్షన్
  • 23 లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న అంశమని వ్యాఖ్య
  • పేపర్ ఎంత మందికి చేరిందో తేల్చాలని ఆదేశం
  • కేంద్రం, ఎన్​టీఏ నుంచి నివేదిక కోరిన సుప్రీం బెంచ్​

న్యూఢిల్లీ: నీట్‌‌ యూజీ పేపర్‌‌ లీక్‌‌ అయ్యిందన్న మాట నిజమే అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 23 లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశం కావడంతో.. ‘నీట్ రీ టెస్ట్‌‌’ను తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని వెల్లడించింది. ఎగ్జామ్ పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా లేకపోతే నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా తాము నీట్‌‌ రీ -టెస్ట్‌‌కు ఆదేశిస్తామని తేల్చి చెప్పింది.

నీట్‌‌ యూజీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయంటూ సుప్రీం కోర్టులో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. నీట్ యూజీ ఎగ్జామ్ రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. వీటిపై సీజేఐ జస్టిస్‌‌ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. లీకైన క్వశ్చన్ పేపర్ సోషల్‌‌ మీడియాలో సర్క్యులేట్ చేశారని తెలిసినా మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్తామని ధర్మాసనం తెలిపింది. కానీ, రీ -టెస్ట్‌‌కు ఆదేశించే ముందు.. లీకైన పేపర్‌‌ ఎంతమందికి చేరిందో తేలాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం బెంచ్​ కొన్ని ప్రశ్నలు అడిగింది.

లీక్ అయ్యిందనే ఒప్పుకోవాల్సిన విషయం

‘‘నీట్‌‌ పేపర్‌‌ లీక్‌‌ అయ్యిందనేది స్పష్టమైంది. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ.. ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ఆ క్వశ్చన్ పేపర్ ఎంతమందికి చేరింది? ఎంతమంది లాభపడ్డారు? ఇప్పటివరకు ఎంత మందిని గుర్తించారు? పేపర్‌‌ లీక్‌‌తో ఇంకా లాభపడ్డవాళ్లు ఎవరైనా ఉన్నారా? ఈ కేసులో ఇంకా తప్పు చేసిన వాళ్లను గుర్తించాల్సి ఉందా? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరగాలి’’ అని కేంద్రాన్ని, ఎన్​టీఏను బెంచ్​ ఆదేశించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ప్రధానంగా తాము అడిగే మూడు ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం ఇవ్వాలని చెప్పింది. ఒకటి.. లీక్‌‌ ఎలా, ఎక్కడకెక్కడ జరిగింది? రెండోది.. పేపర్‌‌ లీక్‌‌కు, ఎగ్జామ్​కు మధ్య ఎంత టైమ్ ఉంది? మూడోది.. నిందితులను ట్రేస్‌‌ చేసేందుకు ఎన్టీఏ తీసుకున్న చర్యలేంటి? వీటికి నివేదికలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటది?

పేపర్‌‌ లీక్‌‌లకు సంబంధించిన లోపాలను పసిగట్టేందుకు దేశవ్యాప్తంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని సీజేఐ జస్టిస్‌‌ డీవై చంద్రచూడ్‌‌ అభిప్రాయపడ్డారు. ‘‘నీట్ పేపర్ సెట్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్​కు, ప్రెస్ నుంచి ఎగ్జామ్ సెంటర్​కు ఎలా పంపారు? ఏ తేదీల్లో ఈ ప్రక్రియ జరిగింది?’’ అని సుప్రీం బెంచ్​ ప్రశ్నించింది. దీనిపై అడిషనల్‌‌ సోలిసిటర్‌‌ జనరల్‌‌ స్పందిస్తూ.. ఒకే సెంటర్​లో పేపర్ లీక్ అయ్యిందన్నారు.

నీట్‌‌ పేపర్‌‌ లీక్‌‌ అయ్యిందనేది స్పష్టమైందని బెంచ్​ తెలిపింది. ఎగ్జామ్​కు 3 గంటల ముందు పేపర్ లీక్ అయ్యిందని ఎన్టీఏ తరఫు అడ్వకేట్ కోర్టుకు వివరించారు. విచారణను గురువారానికి వాయిదా వేస్తూ.. ఆ రోజు పిటిషనర్ల వాదనలు వింటామని సుప్రీం బెంచ్​ చెప్పింది.

నీట్‌‌ పేపర్‌‌ లీక్‌‌ అయ్యిందనేది తేలింది. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ.. ఆ క్వశ్చన్ పేపర్ ఎంత మందికి చేరింది? ఎంత మంది ఆ లీకేజీతో లాభపడ్డారు? ఇప్పటివరకు ఎంత మందిని గుర్తించారు? పేపర్‌‌ లీక్‌‌తో ఇంకా లాభపడ్డవాళ్లు ఎవరైనా ఉన్నారా? ఈ కేసులో ఇంకా తప్పు చేసిన వాళ్లను గుర్తించాల్సి ఉందా? పేపర్‌‌ లీక్‌‌తో లాభపడిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎంత మంది రిజల్ట్స్​ను హోల్డ్‌‌లో పెట్టారు? వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరగాలి.   -
 సుప్రీంకోర్టు